ఏపీ రాజధాని అమరావతి రీ స్టార్ట్ కార్యక్రమం రేపు జరగనుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ టూర్ గంటా 25 నిమిషాలు పాటు ఉండనుంది. 58 వేల కోట్ల విలువైన పనుల శంఖుస్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమాలు ప్రధాని మోడీ చేతుల మీద జరగనున్నాయి. అమరావతి పునఃనిర్మాణ పనులు పెద్ద ఎత్తున ప్రారంభం కానున్న వేళ రాజధానికి తరలివచ్చే వారి కోసం ప్రభుత్వం రవాణా వసతిని కల్పిస్తోంది. ఇందుకోసం ప్రైవేట్ విద్యా సంస్థల బస్సులు, ఆర్టీసీ బస్సులను అధికారులు ఏర్పాటు చేశారు. రాజధాని చుట్టుపక్కల ఉన్న ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, పశ్చిమ గోదావరి, ఏలూరు, ప్రకాశం జిల్లాల నుంచి ఎక్కువ మంది రానున్నారు.
సభకు 6600 బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఒక్కొక్క బస్సులో 120 ఆహార పొట్లాలు,100 అరటి పండ్లు, 120 నీటి సీసాలు, 60 ఓఆర్ఎస్ ప్యాకెట్‌లు, 60 మజ్జిగ ప్యాకెట్లు ఉంటాయి. బస్సులు రేపు మధ్యాహ్నం 12 గంటలకు సభకు చేరుకునేలా ప్రణాళిక రూపొందించారు. దారిలో అల్పాహారం, సభకు వచ్చే సమయానికి భోజనం చేసి ప్రాంగణంలోకి చేరుకుంటారు. సభ నుంచి ప్రజలు తిరిగి బస్సు వద్దకు వచ్చే సమయానికి రాత్రి డిన్నర్‌కు సంబంధించిన ఆహారం ఆయా బస్సుల వద్దకు చేర్చే బాధ్యత పౌరసరఫరాల శాఖ తీసుకుంది. సభకు ఎలాంటి వాటర్ బాటిళ్లు తీసుకు రాకూడదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
Also Read: CM Chandrababu : రైతుల్ని పారిశ్రామిక వేత్తలను చేస్తాం.. యువత ఆలోచనా విధానంలో మార్పు రావాలి!
కిచిడి, చట్నీతో పాటు ఒక ఆరెంజ్ పండు అందరికీ అందిస్తారు. తిరుగు ప్రయాణంలో దారిలోనే డిన్నర్ ముగించుకుని ఇంటికి చేరుకుంటారు. ఎండలు ఎక్కువగా ఉన్నందున అధికారులు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మార్గ మధ్యలో ఉన్న ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిబ్బంది అందుబాటులో ఉండేలా చూస్తున్నారు. సభాప్రాంగణంలో ప్రతి గ్యాలరీలోనూ ఆరుగురితో కూడిన వైద్య బృందం ఉంటుంది. ఎవరైనా అస్వస్థతకు గురైతే ఎక్కడికి తరలించాలో గ్యాలరీ ఇంఛార్జ్ అధికారి సమన్వయం చేసుకుంటారు. మెడికల్ క్యాంప్ల ఏర్పాటు కూడా జరిగిందని మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పారు.
ప్రధాని మోడీ అమరావతి పర్యటనకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. రాజధాని అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రధాని రానున్న తరుణంలో అధికారులు, ప్రజాప్రతినిధులు విజయవాడ కలెక్టరేట్లో సమావేశమై ఏర్పాట్లపై చర్చించారు. మోడీ అమరావతి పర్యటనను విజయవంతం చేయాలని బాపట్ల జిల్లా ప్రజా ప్రతినిధులకు మంత్రులు అనగాని సత్య ప్రసాద్, గొట్టిపాటి రవికుమార్, కొలుసు పార్థసారథి దిశానిర్దేశం చేశారు. కమాండ్ కంట్రోల్ రూమ్ లో మంత్రులు నారాయణ, నాదెండ్ల మనోహర్, పయ్యావుల కేశవ్, కొల్లు రవీంద్ర సమీక్ష నిర్వహించారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని ప్రధానంగా ట్రాఫిక్ రోడ్లు, వర్షం వస్తే వచ్చే ఇబ్బందులపై దృష్టి పెట్టాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు మంత్రులు.