PM Modi: ప్రభుత్వ అధినేతగా పాతికేళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న వేళ ప్రధాని మోడీ దేశప్రజలకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఓ కొత్త నినాదాన్ని ప్రజల ముందుకు తెచ్చారు. 2047 నాటికి భారత్‌ను సంపూర్ణంగా ‘వికసిత భారత్’గా, ఆత్మనిర్భర భారత్‌గా మార్చడమే మన ప్రధాన లక్ష్యమని, దీనిని మనం సాధించి తీరుతామని ప్రధాని మోడీ ఎంతో నమ్మకంతో పునరుద్ఘాటించారు. “మనం చేసి తీరుతాం… We Will Do It” అని ఆయన పిలుపునివ్వగా, సభలో పాల్గొన్న ప్రజలంతా అంతే ఉత్సాహంతో ఆ నినాదాన్ని అందుకున్నారు. ‘వికసిత భారత్ సంకల్ప సభ’లో మాట్లాడిన ప్రధాని మోడీ, తన ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. 2001 అక్టోబర్ 7న తొలిసారిగా గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు, ఒక ప్రభుత్వ అధినేతగా వరుసగా 25 ఏళ్లు సేవ చేసే అవకాశం వస్తుందని తాను ఏనాడూ ఊహించలేదని అన్నారు. ఈ మైలురాయిని చేరుకోవడానికి ప్రజల నిరంతర ఆశీస్సులే కారణమని, ఆ క్రెడిట్ అంతా ప్రజలకే దక్కుతుందని వినమ్రంగా చెప్పారు.
తన ఈ పాతికేళ్ల ప్రయాణంలో ఎదురైన ప్రతీ అనుభవం నుంచి ఎంతో నేర్చుకున్నానని మోడీ తెలిపారు. జీవితంలో జరిగిన ఏ సంఘటనా వృథా పోలేదని, విజయం వచ్చినప్పుడు అది తనను వినమ్రంగా ఉండటం నేర్పితే, వైఫల్యాలు లేదా పతనాలు మళ్లీ ఎలా గెలిచి నిలబడాలో నేర్పాయని పేర్కొన్నారు. అలాగే శుభాకాంక్షలు తెలిపిన శ్రేయోభిలాషులు తనలో ఉత్సాహాన్ని నింపితే, విమర్శకులు తనను తాను సమీక్షించుకునేలా చేశారన్నారు. ప్రతీ సంక్షోభం తన ఓర్పుకు పరీక్షగా నిలిచిందని, లభించిన ప్రతీ విజయం బాధ్యతను పెంచుతూ, అంతకంటే పెద్ద లక్ష్యాల వైపు అడుగులు వేసే ధైర్యాన్ని ఇచ్చిందని వెల్లడించారు. గడిచిన 25 ఏళ్లలో ఎన్నో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు వచ్చాయని, అన్నింట్లోనూ ప్రజలు తనపై నమ్మకంతో నిరంతరం సేవ చేసే అవకాశాన్ని ఇచ్చారని ప్రధాని మోడీ గుర్తుచేసుకున్నారు. బీజేపీ, ఎన్డీయే కూటమి నాయకులకు, సహచర మంత్రులకు, ప్రజాస్వామ్యాన్ని విశ్వసించే రాజకీయ భాగస్వాములందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాస్వామ్యానికి, దేశ రాజ్యాంగానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానన్నారు. ఈ సందర్భంగా ‘సేవా జ్యోతి యాత్ర’లో పాల్గొన్న ప్రతి ఒక్కరినీ అభినందిస్తూ, ప్రజల అపారమైన నమ్మకం వల్లే ఈ సుదీర్ఘ ప్రయాణం సాధ్యమైందని చెప్పారు.
అంతకుముందు రోజు ఉదయమే తాను ఢిల్లీలోని శ్రీ వినాయక ఆలయానికి వెళ్లినట్లు ప్రధాని తెలిపారు. అక్కడ 140 కోట్లకు పైగా ఉన్న భారతీయ ప్రజలందరి సంక్షేమం కోసం ప్రార్థించానని, దేవుడిని ఒక్కటే కోరుకున్నానని చెప్పారు. మరింత శక్తితో, రెట్టింపు ఉత్సాహంతో దేశం కోసం పనిచేసే సామర్థ్యాన్ని, రేయింబవళ్లు ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని ప్రసాదించమని వేడుకున్నట్లు తెలిపారు. ఈ 25 ఏళ్ల ప్రయాణం తనకు ఎంతో సంతృప్తిని, కృతజ్ఞతా భావాన్ని ఇచ్చిందని, అయితే తన దృష్టి ఎప్పుడూ భవిష్యత్తుపైనే ఉందని స్పష్టం చేశారు. భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా, స్వయం సమృద్ధి కలిగిన దేశంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని, ఆ లక్ష్య సాధన కోసం “We Will Do It” అనే దృఢ సంకల్పంతో ముందడుగు వేద్దామని పిలుపునిచ్చారు.

