Pinnelli Ramakrishna Reddy: టీడీపీ అభ్యర్థి బ్రహ్మానంద రెడ్డి ఆరోపణలపై స్పందించారు మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి. తనపై బ్రహ్మనంద రెడ్డి అసత్య ఆరోపణలు చేస్తున్నాడని ఆయన మండిపడ్డారు. మేము ఎటువంటి దాడులు చేయలేదని పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి వెల్లడించారు. అనేక కేసుల్లో ఏ1గా బ్రహ్మానంద రెడ్డి ఉన్నారని.. గతంలో టీడీపీ నుంచి ఆయనను సస్పెండ్ కూడా చేశారన్నారు. ఎన్నికలకు ముందు మాచర్లకు వచ్చి రౌడీయిజం చేస్తున్నాడని పిన్నెల్లి విమర్శించారు. ఎన్నికలకు పది రోజుల ముందు వారికి అనుకూలమైన వ్యక్తిని జిల్లా ఎస్పీగా తెచ్చుకున్నారని ఆరోపించారు. ఓటింగ్‌కు రెండు రోజుల ముందు మాచర్ల సీఐని మార్చారన్నారు.
Read Also: Andhra Pradesh: ఏపీలో పెరిగిన పోలీసుల నిఘా.. సమస్యాత్మక ప్రాంతాలపై డేగకన్ను
దాడులు చేద్దామని వారు ముందే ప్లాన్ చేసుకున్నారని.. అందుకే ఎన్నికల రోజు బ్రహ్మారెడ్డి గుంటూరులో ఉన్నాడని ఆయన ఆరోపించారు. ప్రచారంలో తన భార్యపై కూడా ప్లాన్ ప్రకారమే దాడి చేశారని ఆయన అన్నారు. తాను ఏ విచారణకైనా సిద్ధమని.. సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమంటూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వెల్లడించారు. జూన్ 4వ తేదీన ఫలితాల తరువాత బ్రహ్మారెడ్డి ఎక్కడికి వెళ్తాడో చూడాలన్నారు. దాడులు, అక్రమాలు చేసే చరిత్ర బ్రాహ్మారెడ్డిది.. అభివృద్ధి చేసే చరిత్ర మాది అని ఆయన పేర్కొన్నారు. చందాలతో బతుకుతున్న వ్యక్తి బ్రహ్మారెడ్డి.. మళ్లీ అక్రమాలు చేసి చందాలు వసూళ్లు చేయాలని చూస్తున్నాడన్నారు. వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన ఎంపీ కృష్ణదేవరాయులు కూడా బ్రహ్మారెడ్డి లాగే వ్యవహరిస్తున్నాడని.. బ్రహ్మారెడ్డి బుద్ధులన్నీ ఎంపీ కృష్ణదేవరాయులకు వచ్చాయని విమర్శించారు. మాచర్ల ప్రాంతంలో జరిగిన ఘటనలు, అవినీతిపై సిట్టింగ్ జడ్జితో విచారణకు మేము సిద్ధంగా ఉన్నాం.. పిన్నెల్లి సోదరులు సిద్ధమేనా? అంటూ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి స్పందించారు.