Andhra Pradesh: ఏపీలో పోలింగ్ తర్వాత జరిగిన ఘర్షణల నేపథ్యంలో రాష్ట్రంలో భద్రతను భారీగా పెంచారు. మళ్లీ ఘర్షణలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. పోలింగ్ రోజు జరిగిన హింసతో ఏపీ హై అలర్ట్ కొనసాగుతోంది. రాష్ట్రాన్ని పోలీసులు జల్లెడపడుతున్నారు. రాష్ట్రంలోని పలు గ్రామాల్లో మూలమూలలా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అల్లర్లు సృష్టించిన నిందితుల కోసం గాలిస్తున్నారు. బైండోవర్ కేసులు కూడా నమోదు చేస్తున్నారు. రౌడీ షీట్స్ ఉన్నవారిని కౌంటింగ్ రోజున పోలీస్ స్టేషన్‌కు పిలవాలని పోలీసులు నిర్ణయించారు. తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారిని దూరంగా ఉండే పోలీస్‌స్టేషన్‌కు తరలించాలని పోలీసులు ప్లాన్ చేస్తున్నారు. కౌంటింగ్ రోజున విజయోత్సవ ర్యాలీలు, బాణాసంచా కాల్చడంపై నిషేధం విధించారు. కౌంటింగ్ తేదీ దగ్గరపడుతుండడంతో మరింత అప్రమత్తంగా ఉండాలని నిర్ణయించారు.
Read Also: Valley of Flowers: ఈ భూలోక స్వర్గాన్ని ఎప్పుడైనా చూశారా?.. ప్లాన్ చేసుకోండి..
మరోవైపు పల్నాడు జిల్లాలో ఇంకా టెన్షన్ వాతావరణం కొనసాగుతూనే ఉంది. పోలింగ్ తర్వాత జరిగిన ఘర్షణ నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. గొడవలు జరిగిన ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. మరోవైపు వరుసగా 8వ రోజూ కూడా షాపులను పోలీసులు మూసేయించారు. గొడవల కారణంగా కొందరు వ్యాపారస్తులు స్వచ్ఛందంగా షాపులు మూసేస్తుంటే.. మరికొన్ని షాపులను పోలీసులు మూసేయిస్తున్నారు. కౌంటింగ్ తేదీ దగ్గర పడుతున్న తరుణంలో హింసాత్మక ఘటనలు జరగకుండా పోలీసులు డేగకన్ను వేశారు. కానీ ఓ వైపు పోలీసులకు కూడా వణుకు పుడుతున్నట్లు తెలుస్తోంది.