సంక్రాంతి వచ్చిందంటే సందడే సందడి. భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారం .. పలాస సీతమ్మ తల్లి జాతర మహోత్సవం కనుమ పండుగ సందర్భంగా అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. సీతమ్మ తల్లి జాతర కు సొయంత్రం వేళలో భక్తులు పోటెత్తడంతో జన సంద్రంలా మారిపోయింది.
Read Also: Rishab Pant: కోలుకున్న రిషబ్ పంత్.. రోడ్డుప్రమాదం తర్వాత తొలిసారి ట్వీట్
శ్రీకాకుళం జిల్లా పలాసలో వేంచేసి యున్న సీతమ్మ తల్లిని పట్టణ ప్రజలు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. కనుమ పండుగ సందర్భంగా ఆలయ అర్చకులు ఇఫ్పిలి మల్లేశ్వర శర్మ అమ్మవారిని సర్వాంగసుందరంగా అలంకరించారు . ఆలయ ప్రాంగణమంతా రంగు రంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. బాజా బజంత్రీలు , సన్నాయి మేళ తాళలతో వేదపండితుల మంత్రోచ్ఛారణ నడుమ శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. దూప దీప నైవేద్యాలతో దేదీప్యమానంగా పూజలు చేశారు. అమ్మవారి చల్లని దీవెనలు ఎళ్లవేళలా తమకు ఉండాలని కోరుకుంటూ పలువురు భక్తులు మొక్కులు చెల్లించారు.
పలాస – కాశీబుగ్గ జంట పట్టణాలతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు తండోపతండాలుగా తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. పూజలు,అర్చనలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించి భక్తి పారవశ్యంతో పులకించిపోయారు. సోమవారం తెల్లవారుజామునుంచే ఆలయం వద్ద భక్తులు తరలి వచ్చారు.. భక్తుల తాకిడితో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. ఆలయం దగ్గర జాతర నిర్వహించడంతో యాత్రికుల తాకిడితో ఆ ప్రాంతమంతా జన సంద్రంలా మారిపోయింది. పిల్లలు, పెద్దలు, పండు ముదసలిలు సైతం ఎంతో ఉత్సాహంగా జాతరలో పాల్గొన్నారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉత్సవాల్లో భాగంగా సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
Read Also:China Explosion : చైనాలో భారీ అగ్ని ప్రమాదం.. రోజైనా అదుపులోకి రాని మంటలు