Site icon NTV Telugu

Perni Nani: సభ జరుపుకోవడం చేతకానటువంటివాళ్లు జగన్‌పై యుద్ధం చేస్తారా?

Perni Nani

Perni Nani

Perni Nani: చిలకలూరిపేటలో ప్రజాగళం పేరుతో నిర్వహించిన సభలో ప్రధాని ఏదైనా వాగ్దానం చేశారా అని మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేకంగా కేంద్రం ఏం న్యాయం చేసిందంటూ ఆయన ప్రశ్నలు గుప్పించారు. అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్లే ఏపీకి ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ ఐటీలు ఇచ్చారు.. అంతేకానీ ప్రత్యేకంగా ఏమి ఇచ్చారంటూ ప్రశ్నించారు. సీఎం జగన్‌ పాలనలో ఎంతో అభివృద్ధి జరిగిందని.. మహిళా సాధికారితను సీఎం జగన్‌ ప్రభుత్వం చేసి చూపించిందన్నారు. సభ జరుపుకోవడం చేతగాని మీరు సీఎం జగన్‌ మీద యుద్ధం చేస్తారా అంటూ ఆయన ఎద్దేవా చేశారు. పోలవరం చంద్రబాబుకు పేటీఎమ్‌ అని గతంలో ప్రధాని విమర్శించారని.. ఏ గంగా జలంతో చంద్రబాబు పాపాలను కడిగారని ఆయన ప్రశ్నించారు. చంద్ర బాబు అవినీతి పరుడు అని గతంలో మోడీ అన్నారని.. చంద్రబాబుకి పోలవరం ఏటీఎం అన్నారని.. మరి ఇప్పుడు పోలవరంపై విచారణ ఏమైందని ప్రశ్నించారు. చంద్రబాబుకు ఓటు వేయొద్దని ఎన్టీఆర్‌ చెప్పారని.. చంద్రబాబుకు ఓటు వేయొద్దని ఆయన బంధువులందరూ చెప్పారన్నారు. పోలవరం, స్టీల్‌ ప్లాంట్‌ అంశాలపై ఎందుకు మాట్లాడలేదని ఆయన ప్రశ్నలు గుప్పించారు. ఈ రాష్ట్రానికి ఏం కావాలో సభలో ప్రధానిని ఎందుకు అడగలేదన్నారు.

Read Also: PM Modi: వికసిత్ భారత్ మాత్రమే కాదు.. వికసిత్ ఏపీ మా లక్ష్యం

నాలుగు సిద్ధం సభలు ప్రజలు మళ్ళీ జగన్‌కు ఎందుకు ఓటు వేయాలో తేటతెల్లం చేశాయన్నారు. తమకు ఓటు వేస్తే ఏం చేస్తారో చిలకలూరిపేట సభలో నేతలు చెప్పలేదన్నారు. కాకినాడలో పాచిపోయిన లడ్డూలు, చిలకలూరిపేటలో ఎలా తాజాగా మారాయని పవన్‌ చెప్పలేదని ఎద్దేవా చేశారు.. ఐదేళ్ల కింద చంద్రబాబు ఎందుకు తిట్టారు, ఇప్పుడు మోడీ ఎందుకు కావాల్సి వచ్చిందని ప్రశ్నించారు. చంద్రబాబులో ఈ మార్పుకు కారణం ఏంటన్నారు. మూడు పార్టీల సభ వెలవెలబోయిందన్న ఆయన.. ఈ పొత్తులు, ఒప్పందాలు రాష్ట్రానికి అవసరం లేదన్నారు. మోడీని ఉగ్రవాది అన్న చంద్రబాబుకు ఇప్పుడు విశ్వగురులా కనిపిస్తురా.. అంటూ తీవ్రంగా విమర్శించారు. మోడీ మిమ్మలిని గతంలో తిట్టాను …ఇప్పుడు మోడీ నన్ను క్షమించు అన్నట్టు చంద్ర బాబు మాట్లాడారన్నారు. సభలో చంద్రబాబు భజన మామూలుగా లేదని ఎద్దేవా చేశారు పేర్ని నాని. మూడు పార్టీలు ఎందుకు కలిశాయి అన్న విషయం ఒక్కరూ చెప్పలేదన్నారు. లోపాయికారీ ఒప్పందం ఎవరి కోసం అంటూ ఆయన విమర్శించారు.

Read Also: Chandrababu: ప్రజల సంక్షేమం, అభివృద్ధే మా అజెండా..

సభలో మైక్ మోగదు… ప్రధాని మైక్ ముందు 15 నిమిషాలు మౌనంగా నిలబడ్డారని.. ఈ సభలో ప్రధానిని అవమానించారని ఆయన పేర్కొన్నారు. స్టీల్ ప్లాంట్ ఉంచుతారా ? అమ్ముతారా ? చెప్పలేదే అంటూ పేర్ని నాని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ జగన్‌ను తిట్టడం తప్పితే.. మోడీకి ఒక్క డిమాండ్ చెప్పలేదన్నారు. మోడీ మాయమాటలు చెబుతారని, పోర్టుల అభివృద్ధికి ఒక్క రూపాయి సాయం చేయలేదన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్, కాంగ్రెస్ రెండూ ఒకటే అంటే ఎవరైనా నమ్ముతారా అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఏఐసీసీ అంటే ఆల్ ఇండియా చంద్రబాబు కమిటీ… అందులో అంతా చంద్ర బాబు మనుషులే అంటూ ఆయన పేర్కొన్నారు. ఎన్టీఆర్ మీద గౌరవం ఉంటే భారతరత్న ఇవ్వాలి కదా అంటూ పేర్ని నాని అన్నారు. ఎన్డీఏ సర్కార్ విభజన చట్టంలో ఒక్క హామీని నిలబెట్టుకోలేదన్నారు. కేంద్ర విద్య సంస్థలను ఎన్డీయే సర్కార్ కేవలం ఆంధ్ర ప్రదేశ్ కోసమే పెట్టిందా అంటూ ప్రశ్నించారు.

 

Exit mobile version