Perni Nani: వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందో తేల్చేశారు మాజీ మంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పేర్ని నాని.. పవన్‌తో పాటు చిరంజీవిపై కూడా కామెంట్లు చేశారు.. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు, తాను అందించిన పాలన మళ్లీ తెస్తామని చెప్పాలి.. ఆ దమ్ము నీకు ఉందా పవన్? అంటూ సవాల్ చేసిన ఆయన.. అలా చెప్పు కోవటానికి సిగ్గు పడవా ? అంటూ ఎద్దేవా చేశారు. ఒక సామాజిక వర్గాన్ని రెచ్చ గొట్టి, వాళ్ళని పొట్లం కట్టి చంద్రబాబుకి అమ్మెస్తావ్ అని తెలుసు అంటూ మండిపడ్డారు. ఇక, పవన్ పోటీ చేసేది 25 నుంచి 30 సీట్లు లోపు మాత్రమేనని జోస్యం చెప్పారు. పార్లమెంట్ కి ఒక సీటు చొప్పున పోటీ చేసి సీఎం అవుతావా? పవన్ అంటూ ఎద్దేవా చేశారు పేర్ని నాని.
పవన్ వి దగాకోరుమాటలు.. సినిమా గ్లామర్ తో పవన్ ప్రజలను మోసం చేస్తున్నారు అంటూ దుయ్యబట్టారు పేర్ని నాని.. ఇకనైనా చిరంజీవిని చూసి నేర్చుకో అంటూ హితవుపలికిన ఆయన.. రాజకీయాలు నాకు సరిపడవు అని చిరంజీవి సినిమాలు చేసుకుంటున్నారు.. నువ్వుకూడా అదే చేసుకుంటే బెటర్ అని హితబోధ చేశారు. వైసీపీ వాళ్లను చేర్చుకోను అని చెప్పి.. ఇప్పుడు బస్టాప్ లో టాటా మ్యాజిక్ మాదిరి ఎవరు వస్తే వాళ్లను ఎక్కించుకు వెళ్తాం అని చెప్పు అంటూ ఎద్దేవా చేశారు. తెనాలిలో నాదెండ్ల పోటీ చేస్తారన్నారు.. గుంటూరులో మిగతా సీట్లలో పోటీ చేయరా? అని ప్రశ్నించారు. స్టీల్ ఫ్యాక్టరీ గురించి మోడీ, అమిత్ షా దగ్గర నోరు ఎత్తడం లేదు.. ప్రత్యేక హోదా, ఉక్కు ఫ్యాక్టరీ గురించి ఢిల్లీలో ఎందుకు మాట్లాడవు అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
ఇక, ఎన్నికల్లో టీఆర్ఎస్ కి వ్యతిరేకంగా పోటీ చేసింది చిరంజీవి, పవన్ కల్యాణ్.. తెలంగాణలోకి రాకుండా మిమ్మల్ని టీఆర్ఎస్ వాళ్లు ఆపారని చెప్పుకొచ్చారు పేర్ని నాని.. అప్పట్లో తెలంగాణలో సినిమా షూటింగ్ లు, రిలీజ్ లు ఆపేయ లేదా? అని ప్రశ్నించారు. 175 సీట్లలో పోటీ చేస్తామని పవన్ కల్యాణ్ ఎందుకు ప్రకటించడం లేదన్న ఆయన.. లేదంటే టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తామని చెప్పండి అంటూ సవాల్ చేశారు. మరోవైపు.. టీడీపీ, జనసేన కార్యకర్తలు గంజాయి, హత్య, హత్యాయత్నం లాంటి చాలా కేసులో నిందితులుగా ఉన్నారని ఆరోపించారు. కానీ, వాలంటీర్లపై పవన్ కల్యాణ్ రోజుకో మాట మాట్లాడుతున్నారు అంటూ మండిపడ్డారు మాజీ మంత్రి పేర్నినాని.