Chiranjeevi and Pawan Kalyan: మెగాస్టార్ చిరంజీవి, పవర్‌స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పేర్ని నాని.. వాలంటీర్లపై పవన్ చేసిన కామెంట్లకు కౌంటర్ ఇస్తూ మీడియాతో మాట్లాడిన ఆయన.. మెగా బ్రదర్స్ ప్రస్తావన తీసుకొచ్చారు.. చిరంజీవికి.. పవన్ కల్యాణ్‌కు నక్కకు నాగ లోకానికి ఉన్నంత తేడా ఉందన్న ఆయన.. నేను రాజకీయాలకు పనికి రాను.. తమ్ముడు పనికొస్తారని గతంలోనే చిరంజీవి అన్నారని గుర్తుచేశారు.. అంటే.. చంద్రబాబు చెప్పినట్టు తాను చేయలేనని.. పవన్ కల్యాణ్ చేయగలడనే విషయం తెలుసు కాబట్టే పవన్ రాజకీయాలకు పని కొస్తాడని చిరంజీవి అన్నారంటూ చెప్పుకొచ్చారు పేర్నినాని..
Read Also: Oppo Reno 10 5G: Oppo నుండి 64MP ఫోన్.. ఫీచర్లు ఇవే..!
ఇక, మేం చేసిన అప్పులతో పోర్టులు, మెడికల్ కాలేజీలు, పంచాయతీ భవనాలు కడుతున్నాం. చంద్రబాబు హయాంలో తెచ్చిన అప్పులను పసుపు కుంకమకు తరలించారని ఆరోపించారు పేర్ని నాని.. వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో ప్రతి పైసాకు పక్కా లెక్క ఉందన్న ఆయన.. చంద్రబాబు-పవన్ కల్యాణ్.. కాపుల్ని బీసీల్లో చేరుస్తామని చెప్పి మోసం చేశారని ఫైర్ అయ్యారు.. కాపు ఓట్ల కోసమే 2019 ఎన్నికల్లో పవన్.. చంద్రబాబు విడిపోయినట్టు నటించారని.. పవన్ చేసే మోసాన్ని కాపులు గమనించి గత ఎన్నికల్లో జగన్‌కు ఓటేశారన్నారు.. ఇప్పటికైనా వలంటీర్లకు పవన్ కల్యాణ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పకుంటే మీ విజ్ఞతకే వదిలేస్తున్నామని వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు మొక్కండి.. సార్ అని పిలవండి మాకేం అభ్యంతరం లేదు. ఇక, సీఎం జగన్ ను ఏక వచనంతో మాట్లాడితే.. మేమూ అదే విధంగా మాట్లాడతాం అని వార్నింగ్ ఇచ్చారు.. పవన్ ఒక్కరికే నోరు.. నాలిక లేదు.. వైసీపీ జెండా మోసే కార్యకర్తలకు నోరు, నాలిక ఉందని గుర్తుంచుకోండి అంటూ హెచ్చరించారు మాజీ మంత్రి పేర్నినాని.