Perni Nani: పోలీసులు అధికారులు బరితెగించి ప్రవర్తిస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఏకపక్షంగా వైసీపీ నేతలు, కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని.. అసలు ముద్దాయిలను వదిలేసి తప్పు చేయని వారిపై కేసులు పెడుతున్నారని ఆయన అన్నారు.హింస జరుగుతుందని తెలిసినా పోలీసులు పట్టించుకోలేదని మండిపడ్డారు. పాల్వాయిగేట్‌లో దౌర్జన్యం జరిగితే అడ్డుకోలేదని.. వైసీపీ మద్దతుదారులు ఓటు వేయకుండా అడ్డుకున్నారని పేర్ని నాని పేర్కొన్నారు. ఏపీలో ఈసీ దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ఆయన కామెంట్స్ చేశారు. “పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేస్తే 13నే ఎందుకు కేసు నమోదు చేయలేదు.. ఈ ఘటనపై అప్పుడే టీడీపీ ఎందుకు ఫిర్యాదు చేయలేదు.. డీజీపీకి సిట్ ఇచ్చిన నివేదికలో పిన్నెల్లి ప్రస్తావన కూడా లేదు. కూటమి నేతలు ఎవరిని నియమించాలని కోరితే వారినే నియమించారు.” అని పేర్ని నాని తెలిపారు.
Read Also: Heat Waves: జర ఫైలం.. మధ్యాహ్నం తర్వాత బయటకు రావొద్దు.. ఎందుకో తెలుసా..?
టీడీపీ నేతలు హత్యాయత్నం చేస్తే వారిపై కేసులు పెట్టలేదన్నారు. ఎస్పీ సహా అధికారులకు పిన్నెల్లి ఫిర్యాదు చేశారని పేర్ని నాని తెలిపారు. పోలింగ్ ఆగినట్టు ప్రిసైడింగ్ ఆఫీసర్ లాగ్ బుక్‌లో ఎందుకు లేదని ఆయన ప్రశ్నించారు. ఛానళ్లలో చూసిన తర్వాతే ఈసీ అధికారులు స్పందిస్తారా అంటూ తీవ్రంగా స్పందించారు. “టీడీపీ పిన్నెళ్లి వీడియోను ట్వీట్ చేస్తే ఈసీ విచారణకు ఆదేశిస్తుందా?. అసలు ఏం జరిగిందో విచారణ చేయరా?. కారంపూడిలో విధ్వంసకాడ జరిగితే చూస్తూ ఊరుకుంటారా?”’ అని ప్రశ్నలు సంధించారు. ఈసీ తొందరపాటు చర్యలకు దిగటం దారుణమన్నారు. ఇదే విషయాన్ని ఎమ్మెల్యే పిన్నెల్లి తరపు న్యాయవాది గట్టిగా వాదించి బెయిల్ తెచ్చుకున్నారన్నారు. సీఐ నారాయణ స్వామి చౌదరికి గాయమైతే మొత్తం టీడీపీ కార్యకర్తలకు గాయాలైనట్లు ఫీలయ్యారని.. ఘటన జరిగితే పది రోజులపాటు కేసు కూడా నమోదు చేయకపోవటం ఏంటని ప్రశ్నించారు. పిన్నెల్లిపై ఇంకా ఎన్ని కేసులు నమోదు చేస్తున్నారో పోలీసులు చెప్పాలన్నారు. రెంటచింతల మండలంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు బయటకు రాకుండా చేయాలని, కారంపూడి మండలంలో టీడీపీకి సహకరించేలా సీఐ నారాయణ చౌదరిని నియమించారని ఆరోపించారు.