NTV Telugu Site icon

Perni Nani: కళ్ల ముందు దాడులు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు..

Perni Nani

Perni Nani

Perni Nani: రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. బీహార్ లాంటి రాష్ట్రాల్లో ఉండే సంస్కృతి ఏపీకి తెచ్చారని తీవ్రంగా విమర్శించారు. రోజు రోజుకీ రాష్ట్రంలో ప్రేరేపిత హింస రెట్టింపు అవుతుందని ఆరోపించారు. కళ్ళముందు దాడులు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో పరిస్థితులు చూసి కూటమి నేతలు సిగ్గుపడాలన్నారు. నంద్యాల సుబ్బారాయుడు అనే వైసీపీ నేత నన్ను చంపేస్తారు కాపాడండి అని ఎస్పీకి ఫోన్ చేసినా స్పందన లేదని వ్యాఖ్యానించారు. సుబ్బారాయుడు హత్య జరిగిన తరువాత పోలీసులు వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగ్గయ్యపేటలో శ్రీనివాస్ అనే వైసీపీ కార్యకర్తను ప్రాణం పోయేలా కొట్టి పడేశారని చెప్పారు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఓ పాత డీజీపీ, పాత ఐజీ అమలు చేస్తున్నారని ఆయన ఆరోపణలు చేశారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు వీటికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

Read Also: CM Chandrababu: ప్రత్యేకంగా సీటు వేయాలా?.. కలెక్టర్ల కాన్ఫరెన్సులో ఆసక్తికర సంభాషణ

శాంతిభద్రతలపై పెద్ద పెద్ద మాటలు చెప్పిన పవన్ కళ్యాణ్‌కు ఇవి కనిపించడం లేదా అంటూ ప్రశ్నించారు. ఎన్నికల వరకే రాజకీయాలు.. అయ్యాక అంతా ఒక్కటే అని జగన్ చెప్పాడని ఈ సందర్భంగా వెల్లడించారు. రూల్స్‌కు విరుద్ధంగా మా ఎమ్మెల్యేలు అడిగితే చేయవద్దని జగన్‌ చెప్పారన్నారు. కలెక్టర్ల సదస్సులో ఇచ్చిన హామీల గురించి ఎందుకు మాట్లాడలేదు.. వాటిని గాలికి వదిలేసినట్టేనా అంటూ పేర్ని నాని ప్రశ్నించారు. అన్ని శాఖలను లోకేష్‌ నడుపుతున్నారని ఆయన ఆరోపణలు చేశారు. పవన్ శాఖలు కూడా లోకేష్ అండర్‌లో నడుస్తున్నాయని ఆరోపించారు.

Show comments