NTV Telugu Site icon

Champions Trophy 2025: కాస్త ఓపిక పట్టండి.. ఏం జరుగుతుందో చూస్తారు: పీసీబీ చీఫ్‌

Champions Trophy 2025

Champions Trophy 2025

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విషయంలో సందిగ్థత వీడడం లేదు. ఓవైపు ఆతిథ్యం విషయంలో పాకిస్థాన్‌ మొండిగా ఉండగా.. మరోవైపు పాక్‌కు వెళ్లి ఆడేందుకు భారత్ సిద్ధంగా లేదు. టోర్నమెంట్‌ను హైబ్రిడ్‌ మోడల్‌లో నిర్వహిస్తేనే పాల్గొంటామని ఐసీసీకి బీసీసీఐ తేల్చి చెప్పగా.. భారత్ ఆడే మ్యాచ్‌లను యూఏఈలో నిర్వహించాలని పీసీబీని అంతర్జాతీయ క్రికెట్ మండలి కోరింది. ఈ ప్రతిపాదనకు పీసీబీ ఒప్పుకోవడం లేదు. సోమవారం లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో ఆధునీకీకరణ పనులను పరిశీలించిన పీసీబీ ఛైర్మన్ మొహసీన్‌ నఖ్వీ మీడియాతో మాట్లాడారు.

పాకిస్థాన్‌లో పర్యటించకపోవడానికి గల కారణాలను బీసీసీఐ వివరించాలని తాము ఐసీసీకి లేఖ రాశామని మొహసీన్‌ నఖ్వీ చెప్పారు. ‘ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025కి అర్హత సాధించిన ప్రతి టీమ్ పాకిస్థాన్‌కు వచ్చేందుకు రెడీగా ఉంది. భద్రత విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. భారత్‌కు ఏవైనా అభ్యంతరాలు ఉంటే.. మేం వారితో చర్చించి పరిష్కరిస్తాం. క్రీడలు, రాజకీయాలు వేరు. క్రీడలను రాజకీయం చేయడం నాకు ఇష్టం లేదు. అంతా బాగానే జరుగుందని ఆశిస్తున్నాము. ఐసీసీ త్వరలో ఛాంపియన్స్‌ ట్రోఫీ షెడ్యూల్‌ను ప్రకటిస్తుంది’ అని నఖ్వీ తెలిపారు.

ఛాంపియన్స్‌ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించాల్సి వస్తే పాకిస్తాన్ టోర్నీ నుంచి వైదొలుగుతుందా? అన్న ప్రశ్నకు మొహసీన్‌ నఖ్వీ సమాధానం ఇచ్చారు. ‘పాకిస్థాన్ గౌరవం అన్నింటి కన్నా ముఖ్యమైనది. కాస్త ఓపిక పట్టండి, ఏం జరుగుతుందో చూస్తారు. మా వైఖరి చాలా స్పష్టంగా ఉంది. మొత్తం టోర్నమెంట్ పాకిస్థాన్‌లో జరుగుతుందని అనుకుంటున్నాం’ అని నఖ్వీ పేర్కొన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చిలో ట్రోఫీ జరగాల్సి ఉంది. దాదాపు 8 ఏళ్ల తర్వాత ఛాంపియన్స్‌ ట్రోఫీ జరగబోతుంది. చివరిసారిగా 2017లో ఇంగ్లండ్‌లో ట్రోఫీ జరగగా.. పాకిస్థాన్‌ విజేతగా నిలిచింది.