ఐపీఎల్ 2025లో భాగంగా మంగళవారం ముల్లాన్‌పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ 16 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. 112 పరుగుల స్వల్ప ఛేదనలో కేకేఆర్ 15.1 ఓవర్లకు 95 పరుగులకే ఆలౌటై దారుణ ఓటమిని ఖాతాలో వేసుకుంది. మణికట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ తన స్పిన్ మాయాజాలంతో 4 వికెట్లు పడగొట్టి కోల్‌కతా పతనాన్ని శాసించాడు. అయితే కోల్‌కతా కెప్టెన్ అజింక్య రహానే రివ్యూ తీసుకోకపోవడం కేకేఆర్ విజయావకాశాలపై ప్రభావం చూపింది. జింక్స్ డీఆర్‌ఎస్ ఎందుకు తీసుకోలేదని ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.
కోల్‌కతా ఇన్నింగ్స్‌లోని 8వ ఓవర్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ వేశాడు. అప్పటికే అజింక్య రహానే 17 పరుగులు చేసి.. క్రీజులో కుదురుకున్నాడు. 8వ ఓవర్లోని నాలుగో బంతిని చహల్ గూగ్లీగా సాధించగా.. రహానే స్వీప్ షాట్ ఆడాడు. ఎక్కువగా టర్న్ కాని బంతి జింక్స్ ప్యాడ్లకు తాకింది. వెంటనే చహల్ అప్పీల్ చేయడంతో ఫీల్డ్ అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు. సహచర ఆటగాడు అంగ్‌క్రిష్ రఘువంశీతో చర్చించిన రహానే రివ్యూకు వెళ్లలేదు. అయితే రిప్లేలో బంతి పిచింగ్ ఔట్ సైడ్‌గా సూచించింది. ఒకవేళ రివ్యూకు వెళ్లి ఉంటే రహానేను థర్డ్ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించేవాడు. అప్పుడు కోల్‌కతాకు గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉండేవి.
అజింక్య రహానే నిర్ణయంపై టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ స్పందించాడు. రహానే కాస్తైనా స్వార్థపూరితంగా ఆలోచించాల్సిందని అభిప్రాయపడ్డాడు. ‘రహానే కొంచమైనా స్వార్థ పూరితంగా ఆలోచించాల్సింది. జింక్స్ కోల్‌కతా జట్టుకు కీలక బ్యాటర్. అతడికి డీఆర్‌ఎస్ తీసుకునే అవకాశం ఉన్నా తీసుకోలేదు. డీఆర్‌ఎస్ తీసుకుంటే.. ఔటయ్యే ప్రమాదం నుంచి బయటపడేవాడు. అతడి ఔట్ విషయంలో కాస్త అనుమానం ఉన్నా డీఆర్‌ఎస్ తీసుకోవాల్సింది’ అని కైఫ్ పేర్కొన్నాడు. రహానే నిష్క్రమణ తర్వాత కేకేఆర్ మిగతా బ్యాటర్లు వరుసగా ఔటయ్యారు. దాంతో కేకేఆర్ 95 పరుగులకే ఆలౌటై.. 16 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.