ఉప్పాడ తీర ప్రాంతంలో మత్స్యకారుల సమస్యల పరిష్కారం కోసం కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. కంపెనీల నుంచి వచ్చే పొల్యూషన్ వల్ల మత్య్స సంపద దొరకడం లేదని, దానిపై ఒక నిర్ణయం తీసుకోవాలని గత నెల 23, 24 తేదీలలో మత్స్యకారులు భారీ ఆందోళన నిర్వహించారు. అక్టోబర్ 10లోపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వచ్చి సమస్యకు పరిష్కారం చూపాలని డెడ్ లైన్ పెట్టారు. అప్పటివరకు వేటకు వెళ్ళమని మత్స్యకారులు క్లారిటీ ఇచ్చారు.
Also Read: Botsa Satyanarayana: బొత్స కుటుంబానికి తృటిలో తప్పిన ప్రమాదం!
పవన్ కల్యాణ్ సూచన మేరకు కాకినాడ జిల్లా ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకారుల సమస్యల పరిష్కారం కోసం ఓ కమిటీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. క్షేత్రస్థాయిలో పర్యటనలు చేసి నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించింది. కమిటీలో ఇండస్ట్రీస్, మత్స్యశాఖ కమిషనర్లు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మెంబర్ సెక్రెటరీ, కాకినాడ జిల్లా కలెక్టర్ ఉన్నారు. వారితో పాటు మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన సభ్యులు కూడా ఉంటారని ప్రభుత్వం పేర్కొంది. మత్స్యకారులు మాత్రం పవన్ కళ్యాణ్ వచ్చి తీరాలని అంటున్నారు. మరోవైపు మత్స్యకారుల సమస్యలపై తక్షణం స్పందించి కమిటీ ఏర్పాటు చేసిన సీఎం చంద్రబాబు, మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడుకి పవన్ ధన్యవాదాలు తెలిపారు.