NTV Telugu Site icon

Pawan Kalyan: జనసేనలోకి ముద్రగడ..? ఇంటికి వెళ్లి ఆహ్వానించనున్న పవన్‌ కల్యాణ్‌..!

Mudragada

Mudragada

Pawan Kalyan: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం త్వరలోనే జనసేన పార్టీలో చేరబోతున్నారా? ఆయన ఇంటికి వెళ్లి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్.. ముద్రగడను పార్టీలోకి ఆహ్వానించనున్నారా? ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హీట్‌ పెంచుతున్న తాజా పరిణామం ఇది.. కిర్లంపూడిలోని ముద్రగడ ఇంటికి వెళ్లిన జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్.. ఆయనతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. గతవారం పవన్ కల్యాణ్‌ రాసిన లేఖలు ఆయన వద్ద ప్రస్తావించారు.. కాపులు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా పద్మనాభం తన అభిప్రాయం వ్యక్తం చేశారట.. అంతేకాదు పవన్‌ కల్యాణ్‌ వస్తే కచ్చితంగా ఆహ్వానిస్తానని ముద్రగడ అన్నారు.. ఈ పరిణామాలు ఇలా జరుగుతుండగానే టీడీపీ కాపు నేత జ్యోతుల నెహ్రూ ముద్రగడతో భేటీకి సిద్ధం కావడం ఆసక్తికరంగా మారింది.

Read Also: Jagananna Thodu: గుడ్‌న్యూస్‌ చెప్పిన సీఎం.. వడ్డీ లేకుండా రుణం.. నేడే వారి ఖాతాల్లో నగదు జమ

ఈ రోజు ముద్రగడను కలవనున్న జ్యోతుల నెహ్రూ.. టీడీపీ-జనసేన కూటమితో కలిసి పని చేయాలని ఆయన్ని కోరనున్నారు.. అయితే, ఇప్పటివరకు ముద్రగడ పద్మనాభం.. వైసీపీలో చేరతారనే చర్చ జరుగుతూ వచ్చింది.. అయితే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం నుంచి అనుకూల వాతావరణం లేదని ముద్రగడ అభిప్రాయపడుతున్నారు.. సీట్లు ప్రకటించినప్పుడు కూడా కనీసం పరిగణలోకి తీసుకోలేదని అనుచరులతో చెబుతున్నారట.. ఇదే సమయంలో కాపులు అందరూ కలిసి పోరాడాలని పవన్ కల్యాణ్‌ లేఖ రాయడం, తర్వాత పార్టీ నేతలు వచ్చి కలవడంతో.. ముద్రగడ జనసేనలో చేరడం దాదాపు ఖాయం అనే టాక్ నడుస్తుంది. రెండు, మూడు రోజుల్లో పవన్‌ కల్యాణ్‌.. ముద్రగడను కలుస్తారని ప్రచారం సాగుతోంది. అయితే, మొదటినుంచి టీడీపీ అంటే అగ్గి మీద గుగ్గిలం అయ్యే పద్మనాభం ఆ కూటమిలో కలుస్తారా? అనే చర్చ కూడా జరుగుతుంది.. దానికి తగ్గట్లుగానే ముందుగానే జ్యోతుల నెహ్రూ వెళ్లి కలిసి పని చేద్దామని.. ముద్రగడను ఆహ్వానిస్తారని టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు. మరి తన రాజకీయ భవిష్యత్‌పై ముద్రగడ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? అనేది ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.