ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన మధ్య పొత్తు కుదిరింది. సీట్ల లెక్క తేలింది. జనసేన-బీజేపీకి కలిపి 8 ఎంపీ సీట్లు ఇచ్చేలా ఒప్పందం జరిగింది. ఇందులో బీజేపీ 6, జనసేన 2 చోట్ల పోటీ చేయబోతుందనేది సమాచారం. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎంపీగా పోటీ చేయబోతున్నారు. కాకినాడ నుంచి ఎంపీగా ఎన్నికల బరిలో ఉంటారని ప్రచారం జరుగుతోంది. దీంతోపాటు అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేయబోతున్నారు. ఢిల్లీ పర్యటన తర్వాత ఈ అంశంపై క్లారిటీ రానుంది. మచిలీపట్నం లోక్సభ స్థానం నుంచి జనసేన తరుఫున బాలశౌరి పేరు ఖరారైనట్లై. మరోవైపు.. అనకాపల్లి నుంచి నాగబాబు పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే ఎంపీగా పోటీకి నాగబాబు ఇంట్రెస్ట్ చూపడం లేదని సమాచారం.
Read Also: Maldives: భారతీయులకు మాల్దీవుల మాజీ అధ్యక్షుడు క్షమాపణ
అనకాపల్లి, రాజమండ్రి, ఏలూరు, అరకు, రాజంపేట ఎంపీ సీట్లలో బీజేపీ పోటీ చేయబోతుంది. ఆరో సీటు విషయంలోనే కాస్త సందిగ్థత కనిపిస్తోంది. హిందూపురం కానీ, తిరుపతి ఎంపీ సీటును కానీ బీజేపీ తీసుకునే అవకాశం కనిపిస్తోంది. రాజంపేట నుంచి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, రాజమండ్రి నుంచి పురందేశ్వరీ, ఏలూరు నుంచి సుజనా చౌదరి, అనకాపల్లి సిఎం రమేష్ పేర్లను బీజేపీ ఖరారు చేసినట్లు సమాచారం.
Read Also: Peddireddy Ramachandra Reddy: సింగిల్గా పోటీ చేసి అత్యధిక స్థానాలు సాధిస్తాం..
అసెంబ్లీ సీట్ల విషయానికొస్తే.. బీజేపీ-జనసేన కలిసి 30 అసెంబ్లీ సీట్లలో పోటీ చేయబోతున్నారు. ఇప్పటికే 26 సీట్లలో పోటీ చేయబోతున్నట్లు జనసేన ప్రకటించింది. దీంతో.. 6 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ బరిలోకి దిగనుంది. కైకలూరు, విశాఖలో రెండు స్థానాలు, ధర్మవరం, శ్రీకాళహస్తి, అరకు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయనుంది. ఇక.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాకినాడ ఎంపీతో పాటు ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయనున్నారు. గతంలో భీమవరం, గాజువాక రెండు స్థానాల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి భీమవరం లేదా పిఠాపురం నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది.