NTV Telugu Site icon

Pawan Kalyan: అమిత్‌ షాతో పవన్‌ కీలక భేటీ.. తెలంగాణలో జనసేన సీట్లపై క్లారిటీ!

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan: తెలంగాణ ఎన్నికల్లో జనసేనతో పొత్తుపై బుధవారం స్పష్టత రానున్నట్లు బీజేపీ కీలక నేత ఒకరు వెల్లడించారు. బుధవారం ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలతో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ సమావేశం కానున్నారు. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఢిల్లీకి వెళ్లారు. హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక విమానంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డితో కలిసి పవన్‌ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్‌ ఢిల్లీకి చేరుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డితో పాటు పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ కూడా చర్చల్లో పాల్గొననున్నట్లు సమాచారం. నేడు, రేపు(బుధవారం, గురువారం) రెండు రోజుల పాటు జనసేనాని పవన్‌ కళ్యాణ్ ఢిల్లీలోనే ఉండనున్నారు. నేడు, రేపు బీజేపీ నేతలు అమిత్‌ షా, జేపీ నడ్డాలతో భేటీ కానున్నారు. ప్రధాని మోడీతో కూడా భేటీ కావాలని పవన్‌ భావిస్తుండగా.. ఆ సమావేశం ఇంకా ఖరారు కాకపోవడం గమనార్హం. ఈ సమావేశంలో జీహెచ్‌ఎంసీ సహా పలు స్థానాల్లో ఉమ్మడి అభ్యర్థులపై స్పష్టత వస్తుందని పలువురు పేర్కొంటున్నారు.

Also Read: Kuruva Vijay Kumar: రేవంత్‌ రెడ్డి పై డీజీపీ అంజనీకుమార్‌ కు కురువ విజయ్ ఫిర్యాదు

ఈ రోజు సాయంత్రం 6 గంటలకు అమిత్ షాతో పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్‌ భేటీ కానున్నారు. ఈ భేటీకి కిషన్ రెడ్డి , లక్ష్మణ్‌లు హాజరు కానున్నారు. తెలంగాణలో పొత్తు, సీట్ల పంపకాలపై అమిత్ షాతో చర్చలు జరపనున్నారు. తెలంగాణలో “జనసేన” పొత్తులపై బీజేపీ అగ్రనాయకత్వం నిర్ణయం తీసుకోనుంది. 12 స్థానాల్లో పోటీ చేస్తామని జనసేన ప్రతిపాదించింది. 6 నుంచి 8 స్థానాలను జనసేనకు ఇచ్చేందుకు బీజేపి రాష్ట్ర నాయకత్వం అంగీకరించింది. బీజేపీ అగ్రనాయకత్వంతో చర్చించి జనసేన అంతిమ నిర్ణయం తీసుకోనుంది. జనసేన నేతలు 32 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని బీజేపీ నేతలు వ్యక్తపరిచారు. ఈ విషయంపై కిషన్‌ రెడ్డి, లక్ష్మణ్‌లు ఇటీవల పవన్‌ను కలిసి ఉమ్మడిగా పోటీ చేసే అంశంపై చర్చించారు. ఈ క్రమంలో తెలంగాణలో బీజేపీ, జనసేన పొత్తు అంశం తెరమీదకు వచ్చిన విషయం విదితమే.