NTV Telugu Site icon

Pawan Kalyan: గెలుపు ఖాయం.. కానీ, భారీ మెజార్టీలు కావాలి.. అది చూసి వాళ్లకు భయం వేయాలి..!

Pawan

Pawan

Pawan Kalyan: ఈ ఎన్నికల్లో గెలుపు ఖాయం.. కానీ, భారీ మెజార్టీ కావాలన్నారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. కృష్ణా జిల్లా పెడనలో టీడీపీ అధినేత చంద్రబాబుపై కలిసి ఉమ్మడిగా ప్రచారంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీజేపీ-టీడీపీ-జనసేన కూటమి అధికారంలోకి రాగానే సీపీఎస్ రద్దు అంశంపై ఏడాదిలోగా పరిష్కారం చూపుతాం అన్నారు. టీచర్లను గౌరవిస్తాం అని వెల్లడించారు. ఇక, సీఎం జగన్‌కు నా మీద కోపం పెరుగుతుంది. తాను ఓడిపోతున్నాననే విషయం జగన్‌కు అర్థమైందని ఎద్దేవా చేశారు. నేను భీమవరం నుంచి ఎందుకు మారారని జగన్ నన్ను అడుగుతున్నారు. మరి వైఎస్‌ జగన్‌ 70 మంది ఎమ్మెల్యేలను ఎందుకు వారి వారి స్థానాలను మార్చారు..? అని నిలదీశారు. నోరుంది కదా అని జగన్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఫైర్‌ అయ్యారు.

Read Also: Priyanka Gandhi: బీజేపీ ఎలా చెబుతుంది.. మీరేమైనా జ్యోతిష్కులా..?

జాతీయ ఉపాధి హామీ పథకంలో అత్యంత అవినీతికి పాల్పడిన జగన్.. క్లాస్ వార్ గురించి మాట్లాడతారా..? అని ప్రశ్నించారు పవన్‌ కల్యాణ్.. పోలీసుల టీఏ, డీఏలు ఇవ్వకుండా శ్రమ దోపిడీ చేసిన జగన్.. క్లాస్ వార్ గురించి మాట్లాడతారా..? ఐదేళ్లల్లో పదిసార్లు కరెంట్ బిల్లులు పెంచిన జగన్ పేదలపై భారం మోపారు. కరెంట్ ఛార్జీలు పెంచడం వల్ల రూ. 27 వేల కోట్ల మేర దోపిడీ చేశారని విరుచుకుపడ్డారు. పాస్ పుస్తకం కావాలన్నా.. చేపల చెర్వులు తవ్వాలన్నా.. డ్రైనేజీ కట్టాలన్నా ఇక్కడి ఎమ్మెల్యేకు ముడుపులు ఇవ్వాల్సిందేనట అని ఆరోపణలు గుప్పించారు. ఓ జడ్జి తల్లి ఆస్తులను కూడా జోగి రమేష్ దోచేశాడని సంచలన ఆరోపణలు చేశారు. 18 వేల మంది చేనేతలున్న నియోజకవర్గం ఇది. ఈ నియోజకవర్గంలో అప్పులతో చేనేతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కానీ, మేం అధికారంలోకి రాగానే చేనేతలు, కలంకారీ కార్మికుల కంటనీరు రాకుండా చూస్తాం అని ప్రకటించారు. కలంకారీ కార్మికులకు కళకు బ్రాండింగ్ చేస్తాం. పెడన కలంకారీ కళను రక్షించేందుకు కేంద్రంతో మాట్లాడి ప్రత్యేక చట్టాలు తెస్తాం అన్నారు పవన్‌.

Read Also: Memantha Siddham Bus Yatra: 17వ రోజుకు మేమంతా సిద్ధం బస్సుయాత్ర.. రేపటి షెడ్యూల్‌ ఇదే..

కూటమి అభ్యర్థులను గెలిపించాలి.. దశాబ్దం కాలంపాటు ఏం ఆశించకుండా పని చేశాం.. ఈ సారి గెలుపు ఖాయం.. కానీ భారీ మెజార్టీ కావాలన్నారు పవన్‌ కల్యాణ్‌.. ఎన్డీఏ అభ్యర్థులకు వచ్చిన మెజార్టీలు చూసి జగనుకు భయం వేయాలన్న ఆయన.. మాలో మేం కొట్టుకోవాలని జగన్ చాలా ఆశ పడుతున్నారు. కానీ, జగన్ ఆశ నెరవేరదన్నారు. మత్స్యకారులకు జెట్టీలు ఏర్పాటు చేస్తాం అన్నారు. ఇక, మద్యపానాన్ని నిషేధిస్తామన్న జగన్.. ఇప్పుడు సారా వ్యాపారిగా తయారయ్యారు. నాసిరకం మద్యంతో ప్రజల ప్రాణాలను తీస్తున్నారు. మద్యం ద్వారా రూ. 40 వేల కోట్ల మేర దోపిడీ చేసి.. ఆడ బిడ్డల తాళిబొట్లు తెంచేస్తున్నారు. మద్యం దోపిడీ ద్వారా వచ్చిన సొమ్ముతో ఓట్లు కొని.. మళ్లీ గెలవాలని ప్రయత్నిస్తున్నారు అని దుయ్యబట్టారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.