Site icon NTV Telugu

TDP-Janasena: చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ భేటీ.. ఉమ్మడి మేనిఫెస్టో, సీట్ల సర్దుబాటుపై చర్చ

Chandrababu Pawan Kalyan

Chandrababu Pawan Kalyan

TDP-Janasena: ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ తొలిసారిగా వచ్చారు. ఈ సందర్భంగా ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన, సీట్ల సర్దుబాటు, ఉమ్మడి కార్యక్రమాల నిర్వహణపై నేతలు చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే తొలి విడత చర్చలు పూర్తి అయిన సంగతి తెలిసిందే. పవన్‌కళ్యాణ్‌ వెంట జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ ఉన్నారు. చంద్రబాబు తన ఇంటికి భోజనానికి ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఏపీ ఎన్నికల వేళ వైసీపీ నుంచి టీడీపీ, జనసేన పార్టీల్లోకి పలువురు నేతలు చేరుతుండడం, వారికి సీట్ల కేటాయింపుపై కూడా చర్చిస్తున్నట్లు సమాచారం. రేపు మందడంలో నిర్వహించే భోగి మంటల కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక జీవోలను కాల్చేయనున్నట్లు తెలిసింది.

ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనపై తుది కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి తర్వాత ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటించాలని టీడీపీ – జనసేన కూటమి భావిస్తోంది. ప్రతి చేతికి పని.. ప్రతి చేనుకు నీరు అనే లక్ష్యంతో ఉమ్మడి మేనిఫెస్టో విడుదలకు టీడీపీ – జనసేన కూటమి రంగం సిద్దం చేస్తోంది. ఉమ్మడి మేనిఫెస్టో విడుదల తేదీ.. స్థలాన్ని ఈ భేటీలో ఖరారు చేసే అవకాశం ఉంది. జనసేన ప్రతిపాదించే సీట్ల జాబితాతో పవన్‌ వచ్చినట్లు సమాచారం. అభ్యర్థుల పేర్లు.. ఆయా నియోజకవర్గాల్లో వారికున్న బలాబలాల వివరాలతో సమావేశానికి వచ్చినట్లు తెలిసింది.

Read Also: Breaking: నిరుద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్‌ న్యూస్‌.. సంక్రాంతి తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్‌

ఇదిలా ఉండగా మాజీ మంత్రి హరిరామ జోగయ్య విడుదల చేసిన బహిరంగ లేఖ నేపథ్యంలో ఈ భేటీ ఉత్కంఠ రేపుతోంది. ఆ బహిరంగ లేఖలో.. వచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి వెళ్లాల్సిన ఆవశ్యకతపై పవన్ కళ్యాణ్‌తో చర్చించడం జరిగిందన్నారు. 40 నుంచి 60 సీట్లు జనసేన దక్కించుకోవాల్సి వుందని, 40 వరకు సీట్లు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ చెప్పారని హరిరామ జోగయ్య తెలిపారు. పవన్ కళ్యాణ్‌ను సీఎంగా చూడాలని జనసైనికులు భావిస్తున్నారని, కనీసం రెండున్నరేళ్లయినా పవన్ ముఖ్యమంత్రిగా వుండాలని హరిరామజోగయ్య పేర్కొన్నారు. జనసేన టీడీపీలో కూటమిలో త్వరలో బీజేపీ కూడా చేరే అవకాశం వుందని పవన్ తనకు తెలిపినట్లు ఆయన తెలిపారు. జోగయ్య లేఖ రాసిన కొద్దిగంటల్లోనే పవన్ , చంద్రబాబుల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. టీడీపీ, జనసేన కూటమి కూడా ఎన్నికలపై సీరియస్‌గా దృష్టి సారించింది.

 

Exit mobile version