Pawan Kalyan: జనసేన పార్టీ నాయకులు, శ్రేణులు తమ పంచాయతీల నుంచి పార్లమెంట్ నియోజకవర్గం వరకు అభివృద్ధిలో భాగం కావాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేశారు. తాజాగా మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో పార్టీ ముఖ్యనేతలతో పవన్ సమావేశం నిర్వహించారు. అనంతరం సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ ప్రాంత అభివృద్ధిలో అక్కడ అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో క్రియాశీలకంగా వ్యవహరించేలా పార్టీ శ్రేణులను ముందుకు తీసుకువెళ్దామన్నారు. జనసేన పార్టీ కమిటీల నిర్మాణంలో భాగంగామన్నారు. గ్రామ స్థాయిలో అయిదుగురు సభ్యులతో కమిటీని నియమించాలని, వారు గ్రామాభివృద్ధిలో భాగమయ్యేలా చేద్దామని తెలిపారు. అదే విధంగా మండల, అసెంబ్లీ, లోక్ సభ నియోజకవర్గాల అభివృద్ధిపై ఆయా కమిటీలు దృష్టి కేంద్రీకరించేలా ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు.
READ MORE: AP Heavy Rains: ప్రయాణికులకు అలర్ట్.. ఆ జిల్లాల్లో భారీ వర్షాల ధాటికి రోడ్లు జలదిగ్భందం..
రాష్ట్ర స్థాయి నుంచి క్షేత్ర స్థాయి వరకూ జనసేన పొందిన నామినేటెడ్ పదవుల వివరాలను పరిశీలించారు పవన్ కల్యాణ్. మిగిలిన పదవుల భర్తీపై పలు సూచనలు చేశారు. కూటమి ధర్మాన్ని అనుసరించి ముందుకు వెళ్లడంతోపాటు, పార్టీ కోసం చిత్తశుద్ధితో పని చేసినవారికి వివిధ దశల్లో గుర్తింపు, బాధ్యతలను అందించే దిశగా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. పార్టీ కమిటీల నియామకంపై పవన్ పలు సూచనలు ఇచ్చారు. పవన్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామ స్థాయి నుంచి నియోజక వర్గ స్థాయి వరకూ పార్టీ కార్యక్రమాల నిర్వహణ బాధ్యతలకు అయిదుగురు చొప్పున సభ్యులతో కమిటీలు ఏర్పాటు చేయాలి. ఆ సభ్యులు స్థానికంగా అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించాలి. ఇప్పటికే పైలెట్ ప్రాజెక్ట్ గా పిఠాపురంలో నియోజకవర్గ స్థాయిలో అయిదుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటైంది.. ఆ కమిటీ పని తీరును మదింపు చేసి రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, మండల, నియోజకవర్గ కమిటీలు రూపకల్పన చేయాలి. పార్టీ అంతర్గత వ్యవహారాలకు సంబంధించి నెలకొనే అంశాలను పరిష్కరించేందుకు ఉద్దేశించిన కాన్ ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ విభాగాన్ని కేంద్ర కార్యాలయం నుంచే పర్యవేక్షించాలి. ఈ విభాగంలో 11 మంది వరకు సభ్యులను నియమించాలి. ఈ విభాగం ముందుకు వచ్చే అంశం ప్రాధాన్యం, తీవ్రతను బట్టి ముగ్గురు లేదా మొత్తం విభాగంలోని సభ్యులు చర్చించి పరిష్కరించాలని పార్టీ అధినేత పవన్ దిశానిర్దేశం చేశారు. ఇకపై ప్రతి కమిటీలో మహిళలకు స్థానం కల్పించాలని స్పష్టం చేశారు. అయిదుగురు సభ్యులు ఉండే కమిటీలో తప్పనిసరిగా ఒకరు, గరిష్టంగా ఇద్దరు వీర మహిళలు సభ్యులుగా ఉండాలి.. 11మంది సభ్యులు ఉండే కమిటీ ముగ్గురు వీర మహిళలకు స్థానం ఇస్తూ కమిటీలు ఉండాలని నిర్ణయించారు.