Negligence in Hospital: ప్రతి ఒక్కరు ఏదో ఒక సమయంలో లిఫ్ట్ ఎక్కే ఉంటారు. కొంత మంది ఆఫీసుల్లో, అపార్ట్‌మెంట్లలో రోజూ లిఫ్ట్ ఎక్కుతూనే ఉంటారు. బహుళ అంతస్థుల భవనాలు, ఆఫీసులు, ఆసుపత్రుల్లో ఎవరైనా పైఅంతస్తులకు వెళ్లాలన్నా, దిగాలన్నా లిఫ్ట్ చాలా ముఖ్యం. లిఫ్ట్ లేకుండా 10 ఫ్లోర్లు మెట్లు ఎక్కాలంటే.. చాలా కష్టమవుతుంది. కొన్ని సందర్భాల్లో ఈ లిఫ్ట్‌లు సాంకేతిక కారణంతో మధ్యలో ఆగిపోతుంటాయి. సరైన నిర్వహణ లేకపోవడం, ఇతర కారణాలతో అప్పుడప్పుడు వీటిల్లో చిన్న చిన్న ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు పోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. అయితే వీడియో చూశాక మాత్రం ఇంకోసారి లిఫ్ట్ ఎక్కాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు.
తాజాగా లిఫ్ట్ ప్రమాదానికి చెందిన 17 సెకన్లు ఉండే ఓ భయానక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూస్తే ఎవరికైనా వెన్నులో వణుకు పుట్టాల్సిందే. ఈ వీడియో చూస్తే లిఫ్ట్ ఎక్కాలంటే భయపడేలా ఉంది. ఓ రోగిని స్ట్రైచర్ పై లిఫ్ట్ ద్వారా తీసుకెళ్తున్న క్రమంలో పూర్తిగా లోపలకి వెళ్లక ముందే అది కిందకి వెళ్లిపోయింది. దీంతో రోగి, మరో ఆసుపత్రి సిబ్బంది అందులో చిక్కుకుపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.