Medak Parliament Leaders complaining against each other: తెలంగాణలోని మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్‌లో అభ్యర్థుల మధ్య ఫిర్యాదుల రాజకీయం కొనసాగుతోంది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు ఎన్నికల కమిషన్ (ఈసీ)కి ఫిర్యాదు చేసుకుంటున్నారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు.. గులాబీ నేతలపై అసభ్య పదజాలం వాడారని ఎన్నికల కమిషన్, పోలీసులకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఫిర్యాదు చేశారు. దాంతో సంగారెడ్డి టౌన్ పోలీసులు రఘునందన్ రావుపై కేసు నమోదు చేశారు.
Also Read: Harish Rao: ఈసారి కూడా మెదక్ గడ్డపై బీఆర్ఎస్ జెండా ఎగురుతుంది: హరీష్ రావు
బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామి రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులతో సమావేశం నిర్వహించారని బీజేపీ నాయకులు ఎన్నికల కమిషన్, పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామి రెడ్డి, మాజీ సుడా చైర్మన్ రవీందర్ రెడ్డిపై సిద్దిపేట ట్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు అయింది. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో మెదక్ జిల్లా కలెక్టర్ 106 మంది ఉద్యోగుల్ని తొలగించారు. ఇక బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు తన ఫోటో, ప్రధాని నరేంద్ర మోడీ, కమలం గుర్తుతో ఉన్న క్యాలెండర్‌ను ఓటర్లకు పంచుతున్నారని కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుల రాజకీయంతో మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్ హీటెక్కింది.