India vs Germany Semis Match in Paris Olypics 2024: పారిస్ ఒలింపిక్స్ 2024లో నేడు భారత హాకీ జట్టు కీలక సమరానికి సిద్ధమైంది. మంగళవారం జరిగే సెమీ ఫైనల్లో ప్రపంచ ఛాంపియన్ జర్మనీని ఢీకొంటుంది. గత ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచిన భారత్.. ఈసారి రజతం లేదా స్వర్ణ పతకం సాధించాలనే పట్టుదలతో ఉంది. అయితే సూపర్ ఫామ్‌లో ఉన్న జర్మనీని ఓడించడం భారత్‌కు అంత సుళువేమీ కాదు. కానీ క్వార్టర్స్‌లో దాదాపు 40 నిమిషాల పాటు 10 మందితోనే ఆడి గెలిచిన తీరు భారత్ విశ్వాసాన్ని రెట్టింపు చేస్తోంది.
భారత్, జర్మనీ జట్ల మధ్య బలాబలాల్లో పెద్దగా తేడా ఏమీ లేదు. గత జూన్‌లో ఎఫ్‌ఐహెచ్ ప్రొ లీగ్‌లో జర్మనీని 3-0తో భారత్ ఓడించింది. ఆ తర్వాత రిటర్న్ మ్యాచ్‌లో 2-3తో హర్మన్‌ప్రీత్ సేన ఓడిపోయింది. ప్రస్తుత ఫామ్ చూస్తే.. ఉన్న రెండు జట్ల మధ్య హోరాహోరీ పోరు తప్పదు. చివరి అంతర్జాతీయ టోర్నమెంట్ ఆడుతున్న గోల్‌కీపర్ పీఆర్ శ్రీజేశ్ అనుభవం భారత్‌కు గొప్ప సానుకూలాంశం. అయితే సస్పెన్షన్ కారణంగా కీలక డిఫెండర్ అమిత్ రోహిదాస్ దూరం కావడం ఎదురుదెబ్బే. రోహిదాస్ గైర్హాజరీలోనూ భారత్ బలంగా కనిపిస్తోంది. భారత్ హాకీ జట్టు చివరిసారి 1980లో ఒలింపిక్స్‌లో ఫైనల్ చేరింది.
Also Read: Paris Olympics 2024: ఒలింపిక్స్‌లో నేటి భారత్ షెడ్యూల్ ఇదే.. అందరి కళ్లు నీరజ్ చోప్రాపైనే!
భారత్, బ్రిటన్ మధ్య జరిగిన క్వార్టర్ ఫైనల్లో అమిత్ రోహిదాస్‌కు రిఫరీ జోషువా బర్ట్ రెడ్‌కార్డు చూపించిన విషయం తెలిసిందే. ఇక్కడ రిఫరీ జోషువాకు, బాలీవుడ్‌కు ఓ సంబంధం ఉంది. షారుఖ్ ఖాన్ కీలక పాత్రలో వచ్చిన ‘చక్ దే ఇండియా’ సినిమాలో అతడు ఆస్ట్రేలియా మహిళల జట్టుకు కోచ్‌గా నటించాడు. ఆ సినిమాలో విలన్ అయిన జోషువా.. ఇప్పుడు నిజ జీవితంలో భారత పురుషుల జట్టుకు కూడా విలన్ అయ్యాడు.