Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్ 2024లో పురుషుల బ్యాడ్మింటన్ డబుల్స్‌లో భారత జట్టుకు నిరాశ ఎదురైంది. బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ విభాగంలో ఎన్నో పతకాశలతో వెళ్లిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడి క్వార్టర్ ఫైనల్స్‌లో ఓటమి చవిచూసింది. పురుషుల డబుల్స్ విభాగంలో క్వార్టర్ ఫైనల్‌లో ఓడిపోవడంతో వారు పారిస్ ఒలింపిక్స్ నుంచి నిష్క్రమించారు. లీగ్ మ్యాచ్‌లో అదరగొట్టిన ఈ జోడి క్వార్టర్ ఫైనల్స్‌లో పోరాడి ఓడారు. లీగ్ మ్యాచ్‌ల్లో భాగంగా సాత్విక్ జోడి ఆడిన రెండింటిలోనూ విజయం సాధించి క్వార్టర్స్‌కు ప్రవేశించింది. క్వార్టర్ ఫైనల్‌లో మలేషియాకు చెందిన ఆరోన్ చియా, సో వూయ్ యిక్ జోడిపై 1-2 సెట్ల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. మొదటి సెట్‌ను 21-13తో సునాయాసంగా గెలుచుకున్న సాత్విక్-చిరాగ్ జోడీ.. మరో రెండు సెట్లలో వరుసగా 14-21, 16-21తో పరాజయాన్ని మూటగట్టుకున్నారు.
ఈ ఒలింపిక్స్‌లో భారత్ షూటింగ్‌తో పాటు ఆర్చరీ, బ్యాడ్మింటన్‌లో పతకాలపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఇప్పటికే షూటింగ్‌లో మూడు కాంస్య పతకాలు గెలుచుకోగా.. బ్యాడ్మింటన్‌లోనూ పతకాలపై ఆశలు పెట్టుకుంది. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు, పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్‌పై భారీ ఆశలు పెట్టుకున్నారు. పురుషుల డబుల్స్‌లో సాత్విక్, చిరాగ్ శెట్టి జోడి పతకం గెలుస్తుందని ఆశలు పెట్టుకున్నప్పటికీ క్వార్టర్ ఫైనల్స్‌లో ఓటమితో విజయయాత్రను ముగించింది.