NTV Telugu Site icon

Panchakarla Ramesh Babu: జనసేనలో చేరిన వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్..

Panchakarla Ramesh

Panchakarla Ramesh

Panchakarla Ramesh Babu: ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి షాక్‌ తగిలినట్టు అయ్యింది.. తాజాగా, వైసీపీకి గుడ్‌బై చెప్పిన పంచకర్ల రమేష్‌.. ఈ రోజు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.. మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పంచకర్ల రమేష్‌కు పార్టీ కండువా కప్పి జనసేన పార్టీలోకి ఆహ్వానించారు పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్.. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ మాట్లాడుతూ.. ప్రజల కోసం పవన్ కల్యాణ్‌ రాజకీయాల్లోకి వచ్చారని అభివర్ణించారు.. ఎన్ని తిట్లు తిడుతున్నా.. ప్రజల కోసం పవన్ అన్ని భరిస్తున్నారన్న ఆయన.. జీవితాంతం పవన్ ఆశయాల కోసం తోడుగా పనిచేస్తానని ప్రకటించారు.

ఇక, పంచకర్ల రమేష్ నాకేం కొత్త కాదన్నారు పవన్‌ కల్యాణ్.. పంచకర్ల మా కుటుంబ సభ్యుడని పేర్కొన్న ఆయన.. పంచకర్ల రమేష్‌కు సరైన ప్రాధాన్యత కల్పిస్తామని ప్రకటించారు.. పంచకర్లకు కీలకమైన బాధ్యతలు అప్పగిస్తానని స్పష్టం చేశారు. చాలా మంది ప్రేమతో జనసేన పార్టీలోకి వస్తారు.. ప్రేమతో ఉంటే జనసైనికులు వెన్నెముకలా నిలుస్తారని తెలిపారు పవన్‌ కల్యాణ్‌. కాగా, విశాఖ జిల్లా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న పంచకర్ల రమేష్‌ బాబు ఈ మధ్యే పార్టీకి రాజీనామా చేశారు. వైఎస్సార్‌సీపీకి, జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. ఎన్నో సమస్యలు సీఎం జగన్‌ దృష్టికి తీసుకెళ్లాలని ప్రయత్నించినా వీలు కాలేదని.. ప్రజా సమస్యలు, కింది స్థాయిలో సమస్యలను తీర్చ లేనప్పుడు ఈ పదవిలో ఉండటం, పార్టీలో ఉండటం సమంజసం కాదని రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన విషయం విదితమే.. అధ్యక్షుడు అంటే స్వేచ్ఛాయుత పరిస్థితులు ఇవ్వలేదని.. చాలా వరకు విమర్శించకపోవడమే తనకు రాదన్న ఆయన.. పార్టీ కార్యకర్తలకు న్యాయం చేయలేకపోయానని క్షమించమంటూ పేర్కొన్న విషయం విదితమే..

కాగా, 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు పంచకర్ల రమేష్ బాబు.. పెందుర్తి నియోజకవర్గంలో ప్రజారాజ్యం తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత ప్రజారాజ్యం.. కాంగ్రెస్ లో విలీనం కాగా.. ఏపీ విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆయన.. 2014 ఎన్నికల సమయంలో టీడీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో ఎలమంచిలి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే, 2019 ఎన్నికల్లో రమేష్‌బాబు ఎలమంచిలి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి.. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కన్నబాబురాజు చేతిలో ఓటమిపాలయ్యారు.. ఆ తర్వాత సీఎం వైఎస్‌ జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన ఆయనకు విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్ష పదవిని అప్పగించారు. తాజాగా ఆ పదవికి, పార్టీకి రాజీనామా చేసిన పంచకర్ల రమేష్‌ బాబు.. ఇప్పుడు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు.