క్రికెట్ మ్యాచ్ ఆడుతూ పాకిస్థాన్ సంతతికి చెందిన క్రికెటర్ మరణించాడు. ఈ ఘటన ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌లో జరిగింది. మరణించిన పాకిస్థాన్ సంతతికి చెందిన ఆస్ట్రేలియా క్రికెటర్ జునైద్ జాఫర్ ఖాన్ వయస్సు 40 సంవత్సరాలు పైబడి ఉంది. జునైద్ క్లబ్ స్థాయి ఆటగాడు. అతను మ్యాచ్ ఆడుతున్నప్పుడు.. ఉష్ణోగ్రత 41.7 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంది. ఈ మండే ఎండలో జునైద్ దాదాపు 40 ఓవర్లు ఫీల్డింగ్ చేశాడు. కానీ.. మ్యాచ్ జరుగుతుండగానే, సాయంత్రం 4 గంటల ప్రాంతంలో అతని ఆరోగ్యం క్షీణించింది. స్పృహ తప్పి మైదానంలో కుప్పకూలాడు. ఆ తర్వాత వెంటనే అంబులెన్స్‌కు ఫోన్ చేసినప్పటికీ లాభం లేకపోయింది. జునైద్ 2013లో టెక్ రంగంలో పనిచేయడానికి పాకిస్థాన్ నుంచి అడిలైడ్‌కు వచ్చాడు. అతనికి క్రికెట్ అంటే చాలా ఇష్టం.
READ MORE: Payal Shankar: బీజేపీ చొరవతోనే సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణ సమస్య పరిష్కారమైంది..
జునైద్ ఓల్డ్ కాన్కార్డియన్స్ క్రికెట్ క్లబ్ తరపున ఆ మ్యాచ్ ఆడుతున్నాడు. ఈ మ్యాచ్ అడిలైడ్‌లోని కాంకోర్డియా కాలేజీలో ప్రిన్స్ ఆల్ఫ్రెడ్ ఓల్డ్ కాలేజియన్స్‌తో జరిగింది. ఈ మ్యాచ్‌లో జునైద్ దాదాపు 7 ఓవర్లు బ్యాటింగ్ కూడా చేశాడు. ఈ సమయంలో అతను 16 పరుగులు చేసిన తర్వాత నాటౌట్‌గా నిలిచాడు. డైలీ మెయిల్ ప్రకారం.. జునైద్ రంజాన్ సందర్భంగా ఉపవాసం ఉన్నాడు. కానీ ఇస్లామిక్ నియమాల ప్రకారం.. ఓ వ్యక్తి అనారోగ్యంతో ఉన్నట్లయితే నీరు త్రాగడానికి అనుమతి ఉంటుంది. అందుకే జునైద్ నీరు మాత్రమే తాగినట్లు తెలిసింది. జునైద్ క్రికెట్ క్లబ్ విచారం వ్యక్తం చేస్తూ.. “మా స్టార్ సభ్యులలో ఒకరి మరణం మాకు చాలా బాధ కలిగించింది. మ్యాచ్ సమయంలో అతనికి అకస్మాత్తుగా ఆరోగ్య సమస్యలు ఎదురయ్యాయి. పారామెడిక్స్ ఎంత ప్రయత్నించినా అతన్ని కాపాడలేకపోయాము. అతని కుటుంబం, స్నేహితులు, బృంద సభ్యులకు మా సానుభూతి తెలియజేస్తున్నాము.” అని పేర్కొంది.