Wasim Akram Jokes on Pakistan World Cup 2023 Semifinal Chances: వన్డే ప్రపంచకప్ 2023లో భారత్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు ఇప్పటికే సెమీస్ బెర్తులు ఖరారు చేసుకున్నాయి. శ్రీలంకపై భారీ విజయం సాధించిన న్యూజిలాండ్ కూడా దాదాపుగా సెమీస్ బెర్త్ ఖాయం చేసుకుంది. నాలుగో బెర్త్ రేసులో న్యూజిలాండ్ సహా పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ ఉన్నా.. నాకౌట్ చేరేందుకు కివీస్ మార్గం సుగమం చేసుకుంది. పాక్ నాకౌట్‌లో అడుగుపెట్టాలంటే మహా అద్భుతమే జరగాలి. ఇదే విషయమై పాక్ మాజీ పేసర్ వసీం అక్రమ్ జోకులు పేల్చాడు. ఓ స్థానిక టీవీ ఛానల్ డిబేట్‌లో పాల్గొన్న వసీం తన మాస్టర్ ప్లాన్ ఏంటో చెప్పాడు.
శ్రీలంకపై గెలుపుతో న్యూజిలాండ్ 9 మ్యాచ్‌ల్లో 5 విజయాలు, 10 పాయింట్లతో ఉంది. కివీస్ నెట్ రన్‌రేట్ 0.743గా ఉంది. ఇక 8 మ్యాచ్‌ల్లో 4 విజయాలు, 8 పాయింట్లు ఖాతాలో వేసుకున్న పాక్ 0.036 రన్‌రేట్‌తో ఉంది. బాబర్ సేన తన చివరి మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో పాక్ గెలిస్తే 10 పాయింట్లు ఖాతాలో వేసుకుంటుంది. అయితే కివీస్ నెట్ రన్‌రేట్‌ను దాటాలంటే.. కేవలం విజయం మాత్రమే సరిపోదు. పాక్ కనీసం 287 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ను ఓడించాలి. ఒకవేళ మొదట ఇంగ్లాండ్ 150 పరుగులకే పరిమితమైనా.. లక్ష్యాన్ని పాకిస్తాన్ 3.4 ఓవర్లలోనే ఛేదించాలి. ఈ రెండు జరగడం అసాధ్యం అనే చెప్పాలి.
Also Read: IND vs NZ Semi Final 2023: భారత్‌తో అంత ఈజీ కాదు: ట్రెంట్ బౌల్ట్
పాకిస్తాన్ సెమీస్‌కు చేరే అంశంపై మాజీ ఆటగాడు వసీం అక్రమ్ వ్యంగ్యంగా స్పందించాడు. ‘ఇంగ్లండ్‌పై పాకిస్తాన్ 400కు పైగా స్కోర్ చేయడం లేదా 287 పరుగుల భారీ తేడాతో గెలవడం జరగని పనులు. పాక్ సెమీస్ చేరాలంటే ఓ మార్గం ఉంది. పాకిస్తాన్ ముందుగా బ్యాటింగ్ చేసి ఎక్కువ పరుగులు చేయాలి. ఆపై ఇంగ్లండ్ జట్టును డ్రెస్సింగ్ రూమ్‌లో పెట్టి 20 నిమిషాలు తాళం వేసి.. బ్యాటర్లందరినీ ‘టైమ్డ్ ఔట్’ అయ్యేలా చేయండి’ అని పేర్కొన్నాడు. ప్రపంచకప్ 2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక సీనియర్ ఆటగాడు ఏంజెలో మాథ్యూస్ టైమ్డ్ ఔట్‌గా అవుట్ అయిన విషయం తెలిసిందే. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకునే వసీం సెటైర్లు వేశాడు.