PAK vs BAN Karachi Test Price is Just Rs 15: పాకిస్థాన్ క్రికెట్ ఫ్యాన్స్ మైదానాల్లో మ్యాచ్‌లు చూసేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. అంతర్జాతీయ మ్యాచ్‌లతో సహా పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్) కూడా ప్రేక్షకాదరణ కరువైంది. మ్యాచ్‌ల సమయాల్లో స్టేడియాలన్నీ ఖాళీగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కీలక నిర్ణయం తీసుకుంది. అభిమానులను మైదానాలకు తీసుకురావడానికి టికెట్ ధరలను భారీగా తగ్గించింది. ఎంతలా అంటే.. భారత కరెన్సీలో అయితే టికెట్ ధర కేవలం 15 రూపాయలే.
ఆగస్ట్ 21 నుంచి పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండు టెస్ట్‌ల సిరీస్ ప్రారంభం కానుంది. రావల్పిండి వేదికగా ఆగస్ట్ 21 నుంచి తొలి టెస్ట్.. కరాచీ వేదికగా ఆగస్ట్ 30 నుంచి రెండో టెస్ట్ ఆరంభం కానున్నాయి. తొలి టెస్ట్‌కు ధరలను యధావిధిగా ఉంచిన పీసీబీ.. రెండో టెస్ట్ మ్యాచ్ ధరలను మాత్రం భారీగా తగ్గించింది. రెండో టెస్ట్ జరిగే కరాచీలో కనిష్ట టికెట్ ధరను రోజుకు రూ.50గా పీసీబీ నిర్ణయించింది. భారత కరెన్సీలో ఈ టికెట్ విలువ రూ.15 మాత్రమే.
Also Read: Ben Stokes: ఇంగ్లండ్‌కు భారీ షాక్.. కర్రల సాయంతో నడుస్తున్న బెన్ స్టోక్స్!
కరాచీ టెస్ట్ వీఐపీ టికెట్ ధర రోజుకు రూ.400గా (పాకిస్తాన్ కరెన్సీ) పీసీబీ నిర్ణయించించింది. ప్రీమియం టికెట్ ధర రోజుకు రూ.200, ఫస్ట్ క్లాస్ టికెట్ ధర రోజుకు రూ.100, జనరల్ టికెట్ ధర రోజుకు రూ.50గా ఉంది. రావల్పిండిలో జరిగే తొలి టెస్ట్ కనిష్ట టికెట్ రూ.200గా ఉంది. భారత కరెన్సీలో ఈ టికెట్ ధర రూ.60.30. టికెట్ల ధరలకు సంబంధించి పీసీబీ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికైనా ఫ్యాన్స్ మైదానంకు వస్తారో లేదో చూడాలి. టికెట్స్ రేట్స్ తగ్గించిన పీసీబీపై సోషల్ మీడియాలో భారీ ట్రోలింగ్ జరుగుతోంది. రూ.15కు భారత్‌లో ఓ సమోసా మాత్రమే వస్తుంది అని నెటిజెన్స్ ఎద్దేవా చేస్తున్నారు.