NTV Telugu Site icon

PM Modi: ఈ ఏడాది ఎస్‌సీఓకు పాకిస్థాన్‌ ఆతిథ్యం.. దాయాది దేశాన్ని ప్రధాని మోడీ సందర్శిస్తారా?

Pm Modi

Pm Modi

PM Modi: ఈ ఏడాది అక్టోబర్‌లో షాంఘై సహకార సంస్థ(ఎస్‌సీఓ) సమావేశానికి పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ సమావేశానికి గ్రూప్‌ దేశాల ప్రభుత్వాధినేతలందరినీ ఆహ్వానించారు. ఈ గ్రూప్‌లో భారత్ కూడా భాగం. అదే సమయంలో, పాకిస్తాన్, భారత్‌ మధ్య సంబంధాల గురించి ప్రపంచానికి తెలుసిందే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎస్‌సీఓలో పాల్గొనేందుకు పాకిస్థాన్‌కు వెళతారా అనేది అతిపెద్ద ప్రశ్న. పాకిస్థాన్ విషయంలో మోడీ ప్రభుత్వ విధానం చాలా స్పష్టంగా ఉంది. పాక్ ఉగ్రవాదులకు మద్దతు ఇస్తున్నంత కాలం ఇరు దేశాల మధ్య ఎలాంటి చర్చలు ఉండవని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పదే పదే పునరుద్ఘాటించారు.

అయితే, భారత్‌తో సంబంధాలను మెరుగుపరుచుకోవాలని పాకిస్థాన్ ఎప్పుడూ వాదిస్తోంది. నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసినప్పుడు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆయన అన్న నవాజ్ షరీఫ్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అయితే, నవాజ్ షరీఫ్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ, పాకిస్థాన్‌కు ప్రధాని మోడీ తగిన సమాధానం కూడా ఇచ్చారు. “నవాజ్ షరీఫ్, మీ సందేశాన్ని నేను అభినందిస్తున్నాను. భారత ప్రజలు ఎల్లప్పుడూ శాంతి, భద్రత, ప్రగతిశీల ఆలోచనలకు అనుకూలంగా ఉంటారు. మా ప్రజల శ్రేయస్సు, భద్రత ఎల్లప్పుడూ మా ప్రాధాన్యత” అని ఆయన అన్నారు. కజకిస్థాన్ రాజధాని అస్తానాలో జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) శిఖరాగ్ర సమావేశంలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన విదేశాంగ మంత్రి జై శంకర్‌.. ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగాన్ని చదివారు. ఉగ్రవాదంపై పోరు అనేది ఎస్‌సీఓ ప్రాథమిక లక్ష్యాలలో ఒకటని ఇందులో ఆయన గుర్తు చేశారు.

ఎస్‌సీవోలో ఎనిమిది దేశాలు
భారతదేశం, చైనా, రష్యా, పాకిస్తాన్, కజకిస్తాన్, కిర్గిజిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ ఎస్‌సీఓ సభ్య దేశాలుగా ఉన్నాయి. ఇది ఒక ప్రభావవంతమైన ఆర్థిక, భద్రతా సంస్థ. ఇది అతిపెద్ద అంతర్-ప్రాంతీయ అంతర్జాతీయ సంస్థలలో ఒకటిగా ఉద్భవించింది.