NTV Telugu Site icon

Champions Trophy 2025: భారత్‌కు రావొద్దు.. పాక్‌కు హర్భజన్‌ కౌంటర్!

Harbhajan Singh

Harbhajan Singh

ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025పై సందిగ్ధత ఇంకా కొనసాగుతూనే ఉంది. పాకిస్థాన్‌కు వెళ్లేది లేదని, హైబ్రిడ్ మోడల్‌లో అయితే టోర్నీ ఆడుతామని ఐసీసీకి బీసీసీఐ స్పష్టం చేసింది. పాక్‌లో మొత్తం టోర్నీ నిర్వహిస్తామని, హైబ్రిడ్ మోడల్‌కు తాము అస్సలు ఒప్పుకోమని పీసీబీ పేర్కొంది. మొండిపట్టు మీదున్న పాకిస్థాన్‌కు ఐసీసీ షాక్ ఇచ్చింది. హైబ్రిడ్ మోడల్‌కు ఒప్పుకోకుంటే.. టోర్నీ మొత్తాన్ని షిఫ్ట్ అవుతుందని పీసీబీకి ఐసీసీ చెప్పింది. దెబ్బకు దిగొచ్చిన పీసీబీ.. హైబ్రిడ్ మోడల్‌కు తాము సిద్దమే అని తెలిపింది.

హైబ్రిడ్‌ మోడల్‌కు అంగీకరిస్తామని చెప్పిన పీసీబీ.. ఓ మెలిక పెట్టింది. భవిష్యత్తులో పాకిస్తాన్ టీమ్ కూడా ఐసీసీ టోర్నీల కోసం భారత్‌కు వెళ్లాడని, ఆ మ్యాచ్‌లను తటస్థ వేదికల్లో నిర్వహించేలా హామీ ఇవ్వాలని ఐసీసీని పీసీబీ కోరింది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్‌ సింగ్.. పీసీబీకి కౌంటర్ ఇచ్చాడు. ఐసీసీ టోర్నీల కోసం భారత్‌కు పాక్ రావొద్దని, తమకు ఎలాంటి బాధ లేదని పేర్కొన్నాడు. పాకిస్థాన్‌లో పరిస్థితులు చక్కబడేవరకు టీమిండియా పర్యటించదని భజ్జీ చెప్పుకొచ్చాడు.

Also Read: IND vs AUS: అడిలైడ్‌ టెస్టు.. టీమిండియాకు గుడ్ న్యూస్!

సోమవారం న్యూఢిల్లీలో జరిగిన వరల్డ్ టెన్నిస్ క్రికెట్ లీగ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో హర్భజన్‌ సింగ్ మాట్లాడుతూ… ‘పాకిస్థాన్‌కు ఇష్టం లేకపోతే భారత్‌కు అస్సలు రావొద్దు. మాకు ఎలాంటి బాధ లేదు. పాక్ టీమ్ భారత్‌కు రాకపోతే.. ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. ప్రస్తుత క్రికెటర్లను అడిగినా ఇదే విషయం చెప్తారు. పాకిస్థాన్‌లో పరిస్థితి భిన్నంగా ఉంటే.. ఈ విషయంలో భారత్ వైఖరి మరోలా ఉండేది. మొండి వైఖరిని వదిలేసి ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025ని జరగనివ్వండి. టోర్నీని పాక్ ఆపలేదు. మలేసియా, శ్రీలంక దేశాలు ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. పాకిస్థాన్‌లో పరిస్థితులు చక్కబడేవరకు భారత్ పర్యటించదు’ అని అన్నాడు.

Show comments