Pakistan: పాకిస్థాన్ డబుల్ గేమ్.. మధ్యవర్తిత్వం పేరుతో ట్రంప్‌ను ఇలా మోసం చేశారేంట్రా బాబు!

Pakistan Secretly Sheltered

Pakistan Secretly Sheltered

Pakistan: పాకిస్థాన్ వక్రబుద్ధి గురించి పెద్దగా చెప్పనవసరం లేదు. తాజాగా మరోసారి దాయాది దేశం డబుల్ గేమ్ బయటపడింది. అమెరికా-ఇరాన్ మధ్య శాంతిదూతగా నటిస్తూనే, పాకిస్థాన్ తెరవెనుక ‘చోర రాజకీయం’ నడిపిందనే సంచలన విషయం బయటపడింది. ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న తరుణంలో అమెరికా దాడుల నుంచి కాపాడుకోవడానికి ఇరాన్ తన సైనిక విమానాలను పాకిస్థాన్‌లోని ‘నూర్ ఖాన్ ఎయిర్‌బేస్’కు రహస్యంగా తరలించిందని సీబీఎస్ న్యూస్ వెల్లడించింది.

అమెరికా అధికారులను ఉటంకిస్తూ సీబీఎస్ న్యూస్ ఈ వాదన చేసింది. ఆ నివేదిక ప్రకారం.. ఏప్రిల్ ఆరంభంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణను ప్రకటించిన కొద్దిసేపటికే ఇరాన్ పాకిస్థాన్‌లోని నూర్ ఖాన్ వైమానిక స్థావరం (రావల్పిండి)కి అనేక విమానాలను పంపింది. నూర్ ఖాన్ వైమానిక స్థావరంలో ఇరాన్ మోహరించిన విమానాలలో ఇరాన్ వైమానిక దళానికి చెందిన RC-130 గూఢచారి విమానం సైతం ఉంది. అమెరికా దాడుల బారి నుంచి రక్షించుకోవడానికి ఇరాన్ తన మిగిలిన సైనిక విమానాలను పాకిస్థాన్‌లో దాచిపెట్టిందని నివేదిక స్పష్టం చేసింది. ఇక, ఈ వార్తలపై స్పందించిన యునైటెడ్ స్టేట్స్ సెనేటర్ లిండ్సే గ్రాహం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది నిజమైతే మధ్యవర్తిగా పాకిస్థాన్ పాత్రను పునఃసమీక్షించాల్సి ఉంటుందని, ఇజ్రాయెల్ పట్ల పాక్ వైఖరి దృష్ట్యా ఈ చర్యలో ఆశ్చర్యం లేదని విమర్శించారు. మరోవైపు.. ఈ వార్తలపై స్పందించిన పాకిస్థాన్.. నూర్ ఖాన్ ఎయిర్‌బేస్ జనసాంద్రత గల ప్రాంతంలో ఉందని, అక్కడ విమానాలను దాచడం అసాధ్యమని ఈ ఆరోపణలను కొట్టిపారేసింది. అటు ఆఫ్ఘనిస్థాన్‌లోనూ ఇరాన్ విమానాలు ఉన్నాయనే వార్తలు వచ్చినా, తాలిబన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ వాటిని ఖండించారు. తన ప్రధాన ఆయుధ సరఫరాదారు అయిన చైనాను, పొరుగు దేశం ఇరాన్‌ను నొప్పించకుండానే.. మరోవైపు అమెరికాతో సంబంధాలను కాపాడుకోవడానికి పాకిస్థాన్ ఆడుతున్న ఈ ద్వంద్వ వ్యూహం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.