Site icon NTV Telugu

T20 Worldcup: భారత్ గెలుపు కోసం పాక్‌ పూజలు.. మరి వరుణుడు కరుణిస్తాడా?

Pakistan

Pakistan

T20 Worldcup: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా నేడు భారత్-దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్ జరగనుంది. పటిష్ట జట్టయిన దక్షిణాఫ్రికా మనకు సవాల్‌ విసురుతోంది. ఈ మ్యాచ్‌ నెగ్గితే టీమిండియాకు గ్రూప్‌లో అగ్రస్థానం మాత్రమే కాక సెమీస్‌ బెర్త్‌ కూడా దాదాపు ఖాయమవుతుంది. ఈ మ్యాచ్‌ ఓడితే నాకౌట్‌ బెర్తు కోసం మళ్లీ ఉత్కంఠ తప్పదు. ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించాలని పాకిస్థాన్‌ అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. అయితే, ఇందుకో కారణం కూడా ఉంది. సూపర్-12 ఆరంభ మ్యాచ్‌లో ఇండియా చేతిలో ఓడిన పాకిస్థాన్, అనంతరం జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లోనూ పరాజయం పాలైంది. దీంతో గ్రూప్-2లో చివరి నుంచి రెండో స్థానానికి పడిపోయిన పాకిస్థాన్ సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. పాక్‌ జట్టు సెమీస్‌ ఆశలు చిగురించాలంటే భారత జట్టు తన తదుపరి మ్యాచుల్లో విజయం సాధించాల్సి ఉంటుంది.

పాకిస్థాన్ ఇంకా దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్‌తో ఆడాల్సి ఉండగా.. ఈ మూడు మ్యాచుల్లోనూ అది విజయం సాధించినా సెమీస్‌కు చేరడం కష్టమే. బాబర్ సేన సెమీస్‌కు చేరుకోవాలంటే భారత జట్టు నేడు దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్‌తోపాటు జింబాబ్వే, బంగ్లాదేశ్‌లపైనా విజయం సాధించాలి. అప్పుడు ఆయా జట్ల సెమీస్ అవకాశాలకు గండి పడుతుంది. ఇది పాకిస్థాన్‌కు వరంగా మారుతుంది. కాబట్టే భారత్ తలపడే మూడు మ్యాచుల్లోనూ విజయం సాధించాలని పాక్ అభిమానులు కోరుకుంటున్నారు. టీమిండియా మ్యాచ్‌ ఆడుతుంటే పాకిస్థాన్‌ వాళ్లు ప్రార్థించడం ఎప్పుడైనా జరిగిందా.. అంటే ఈ ఆదివారం ఆ దృశ్యమే చూడబోతున్నాం. ఎందుకంటే పాక్‌ జట్టు సెమీస్‌ చేరడం భారత్‌ చేతుల్లోనే ఉంది. అందుకే భారత్ గెలవాలని దాయాది జట్టు కోరుకుంటోంది. పెర్త్‌లోని ఆప్టస్‌ మైదానంలో గతంలో 21 మ్యాచ్‌ల్లో మొదటి బ్యాటింగ్‌ చేసిన 13 జట్లు గెలుపొందాయి. కావున మొదట బ్యాటింగ్‌ చేసిన జట్టుకు గెలుపు అవకాశాలు ఉన్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Ind vs SA: దక్షిణాఫ్రికాతో భారత్‌ పోరు నేడే.. గ్రూప్‌లో అగ్రస్థానంపై కన్నేసిన జట్లు

ఇదిలా ఉండగా.. టీ20 ప్రపంచకప్‌లో అజేయంగా నిలిచిన టీమిండియా దక్షిణాఫ్రికాతో తలపడనున్న నేపథ్యంలో వరుణుడు కరుణిస్తాడా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఆకాశం మేఘావృతమై ఉందని, వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు సూచించడంతో అభిమానులు భయపడుతున్నారు. వాతావరణ శాఖ ప్రకారం.. సాయంత్రం మేఘావృతమై ఉంటుందని.. కానీ కొన్ని చోట్ల వర్షం ఉండదని ప్రకటించింది. ఇప్పటి వరకు వర్షం కారణంగా ప్రపంచకప్‌లో కొన్ని మ్యాచ్‌లు రద్దయ్యాయి. పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియం భారత్, దక్షిణాఫ్రికా మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. శనివారం కూడా పెర్త్‌లో వర్షం కురిసింది. సెమీ ఫైనల్‌కు చేరుకోవడానికి భారత్‌, దక్షిణాఫ్రికా జట్లకు ఇది కీలక మ్యాచ్‌. ఈ కీలక మ్యాచ్‌లో వాతావరణం కీలక పాత్ర పోషించనుంది.

Exit mobile version