Pakistan EX Cricketer Hasan Raza Feels BCCI is cheating in ODI World Cup 2023: సొంత గడ్డపై జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతుంది. గురువారం ముంబైలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 302 పరుగుల భారీ తేడాతో గెలుపొందిన టీమిండియా.. ఈ ఎడిషన్‌లో వరుసగా ఏడో విజయాన్ని నమోదు చేసింది. టోర్నీలో ఇప్పటివరకు అపజయమే లేని భారత్.. సెమీస్‌కు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో రాణిస్తున్న టీమిండియాను ఓడించండం టాప్ జట్లకు సైతం కుదరడం లేదు. భారత్ వరుస విజయాలు చుసిన కొందరికి మింగుడుపడడం లేదు.
వన్డే ప్రపంచకప్ 2023లో భారత్ కేవలం బ్యాటింగ్ మీద ఆధారపడడం లేదు. బౌలింగ్‌లోనూ దుమ్మురేపుతోంది. భారత బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, మొహ్మద్ షమీ, మొహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్ వికెట్స్ పడగొడుతూ జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. స్వింగ్, పేస్, బౌన్స్‌తో పేసర్లు.. స్పిన్‌తో స్పిన్నర్లు ప్రత్యర్థులను ఓ ఆటాడుకుంటున్నారు. ఆస్ట్రేలియా, పాకిస్తాన్ జట్లను 200 మార్క్ కూడా అందుకోనివ్వని భారత బౌలర్లు.. న్యూజీలాండ్, ఇంగ్లండ్ జట్లను తక్కువ స్కోరుకే కట్టడి చేశారు. ఇక శ్రీలంకపై చెలరేగి 55 పరుగులకే ఆలౌట్ చేశారు.
భారత బౌలర్ల ప్రదర్శన చూసి పాకిస్తాన్ మాజీ క్రికెటర్ హసన్ రజా కుళ్లుకుంటున్నాడు. బీసీసీఐ చీటింగ్ చేస్తోందని, భారత జట్టుకు స్పెషల్ బాల్స్ ఇస్తోందని సంచలన కామెంట్స్ చేశాడు. ‘వన్డే ప్రపంచకప్ 2023 మ్యాచులు చూస్తుంటే బీసీసీఐ చీటింగ్ చేస్తున్నట్లు అనిపిస్తోంది. మిగతా జట్ల బౌలర్ల కన్నా.. భారత బౌలర్లకు ఎక్కువ స్వింగ్ లభిస్తోంది. బీసీసీఐ, ఐసీసీ టీమిండియాకు స్పెషల్ బాల్స్ ఇస్తున్నట్లు అనిపిస్తోంది. డీఆర్ఎస్ నిర్ణయాలు కూడా టీమిండియాకే అనుకూలంగా వస్తున్నాయి. దీనిపై ఐసీసీ విచారణ జరిపించాలి’ అని హసన్ రజా అన్నాడు.
Also Read: BSNL Diwali Offer: బీఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్లకు ‘దీపావళి బొనాంజా’.. సూపర్ రీఛార్జ్ ప్లాన్స్ ఇవే!
హసన్ రజా వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. హసన్ వ్యాఖ్యలపై క్రికెట్ ఫ్యాన్స్ జోకులు పేల్చుతున్నారు. ‘భారత్ విజయాలు హసన్ రజాకు మిగుడుపడడం లేదు’, ‘పాకిస్తాన్ మరోసారి వక్రబుద్ధి చూపించింది’, ‘మ్యాచ్ ఫిక్సింగ్ చేసిన హసన్ రజా ఈ వ్యాఖ్యలు చేయడం హాస్యపదంగా ఉంది’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మ్యాచ్ ఫిక్సింగ్ కారణంగా హసన్ రజాపై నిషేధం పడింది. అతడు పాక్ తరఫున 7 టెస్టులు, 16 వన్డేలు ఆడాడు.