ఆసియా కప్ 2025లో భాగంగా బుధవారం దుబాయ్ వేదికగా పాకిస్థాన్, యూఏఈ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ ముంగిట నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇండో-పాక్ కరచాలన వివాదానికి బాధ్యుడిగా పేర్కొంటూ మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌ను టోర్నీ నుంచి తప్పించాలన్న తమ డిమాండ్‌కు ఐసీసీ అంగీకరించకపోవడంతో.. యూఏఈ మ్యాచ్‌ను బహిష్కరించడానికి పాక్ సిద్ధమైంది. హై డ్రామా తర్వాత రిఫరీ ఆండీ తమ జట్టుకు క్షమాపణ చెప్పినట్లు పీసీబీ ఓ ప్రకటన విడుదల చేసింది. వెంటనే ఆటగాళ్లు మైదానానికి వచ్చారు. అన్ని పరిణామాల నేపథ్యంలో మ్యాచ్ నిర్ణీత సమయం కంటే గంట ఆలస్యంగా ప్రారంభం అయింది.
Also Read: Asia Cup 2025: అందుకే ఆసియా కప్ నుంచి వైదొలగలేదు: పీసీబీ
పీసీబీ తీరుపై భారత మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత మురళీ కార్తిక్ విమర్శలు గుప్పించారు. టోర్నీని బాయ్‌కాట్ చేసేంత సీన్ పాకిస్థాన్‌కు లేదన్నారు. ‘పాకిస్థాన్ జట్టుకు ఓ విషయం చెప్పాలి. ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే దానికే కట్టుబడి ఉండండి. జీవితంలో ప్రతి ఒక్కరూ ఇలానే ఉంటారు. పాక్ జట్టుకు మాత్రం అలా ఉండదు. అందుకు కారణం లేకపోలేదు. 16 మిలియన్ డాలర్ల ఆదాయం పీసీబీకి కనిపిస్తోంది. టీమిండియా కరచాలనం వివాదంతో భారీ మొత్తాన్ని వద్దనుకొనే పరిస్థితి పాక్‌కు లేదు. బాయ్‌కాట్ చేస్తామని చెప్పడం అస్సలు బాగోలేదు. చిన్న పిల్లలు కూడా ఇలా చేయరు. ఇదంతా నాకు ఫన్నీగా అనిపిస్తోంది. ఫాన్స్ ఇంట్లో కూర్చునే ఇదంతా చూస్తున్నారు. గంటపాటు ఆలస్యంగా ఎందుకు మ్యాచ్ స్టార్ట్ అయిందని చర్చించుకుంటారు. పాకిస్థాన్‌లోని అభిమానులు, చిన్నారులు తమ స్టార్లు ఎలా ఆడతారని ఆసక్తిగా ఉంటారు. మీరు మాత్రం లేనిపోని వివాదాలకు తెరదీస్తారు. పీసీబీ పరువు పూర్తిగా పోయింది’ అని మురళీ కార్తిక్ మండిపడ్డారు.
