Pakistan T20 World Cup: టోర్నమెంట్ ఏమైనా, వేదిక ఏదైనా అందులో ఇండియా – పాకిస్థాన్ తలపడుతున్నాయంటే అది హై ఓల్టేజ్ మ్యాచ్ అవుతుంది. క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్న T20 ప్రపంచ కప్‌లో పాకిస్థాన్ ఎంట్రీ ఇస్తుందా లేదా అనే చర్చపై ఈరోజు ముగింపు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రోజు సాయంత్రం పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్‌తో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ఒక ముఖ్యమైన సమావేశం నిర్వహిస్తారని, ఆ తర్వాత T20 ప్రపంచ కప్‌లో పాక్ పాల్గొంటుందా లేదా అనే దానిపై నిర్ణయం తీసుకోవచ్చని పలు వర్గాలు తెలిపాయి. ఈ సమావేశం చాలా ముఖ్యమైనది, ఎందుకంటే ఈ టోర్నమెంట్‌లో పాకిస్థాన్ జట్టు పర్యటనపై తుది నిర్ణయం PCB తీసుకోదని, పాకిస్థాన్ ప్రభుత్వం తీసుకుంటుందని నఖ్వీ ఇప్పటికే స్పష్టం చేశారు.
‘ప్రభుత్వం చెప్పినట్లుగానే మేము చేస్తాము’..
నిజానికి ఆదివారం పీసీబీ T20 ప్రపంచ కప్‌లో పాల్గొనే 15 మంది సభ్యుల పాక్ జట్టును ప్రకటించింది. కానీ ఆ ప్రకటనను టోర్నమెంట్‌లో పాక్ జట్టు పాల్గొనడాన్ని ధృవీకరించినట్లుగా భావించకూడదని పీసీబీ ఛైర్మన్ తేల్చిచెప్పారు. లాహోర్‌లో ఆటగాళ్లు, ప్రధాన కోచ్ మైక్ హెస్సన్‌తో జరిగిన క్లోజ్డ్ డోర్ సమావేశంలో నఖ్వీ బోర్డు వైఖరిని స్పష్టం చేసినట్లు సమాచారం. నఖ్వీ మాట్లాడుతూ.. “మేము ప్రభుత్వ సలహా కోసం ఎదురు చూస్తున్నాము. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా, మేము దానిని అనుసరిస్తాము. వారు మమ్మల్ని ప్రపంచ కప్‌లో పాల్గొనకూడదనుకుంటే, మేము వెళ్లము” అని ఆయన అన్నారు. ఈ ప్రకటనతో PCB బంతిని ప్రభుత్వ కోర్టులో పెట్టిందని స్పష్టం చేసింది.
పలు నివేదికల ప్రకారం.. ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఈ ఉన్నత స్థాయి సమావేశం జరిగే అవకాశం ఉందని సమాచారం. టోర్నమెంట్‌కు సంబంధించిన వివిధ అంశాలు, ముఖ్యంగా భద్రత, ఐసీసీ నిర్ణయాలపై పాకిస్థాన్ అసంతృప్తి, ఈ సాయంత్రం జరిగే సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఇది పాకిస్థాన్ జట్టు T20 ప్రపంచ కప్ ప్రయాణాన్ని నిర్ణయిస్తుంది ఈ నివేదికలు వెల్లడించాయి.
