PCB demands compensation from ACC over Asia Cup Loss: ఆసియా కప్ 2023 విషయంలో ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ), పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మధ్య గొడవ ఇంకా సమసిపోలేదు. శ్రీలంకలో వర్షాల వల్ల ఆసియా కప్ పెద్దగా సక్సెస్ కాక తాము నష్టపోతున్నామని, తమకు ఏసీసీ నష్టపరిహారం చెల్లించాలని పీసీబీ డిమాండ్ చేస్తోందట. తమకు పరిహారం కావాలంటూ పీసీబీ చీఫ్ జకా అష్రాఫ్.. ఏసీసీ అధ్యక్షుడు జై షాకు మెయిల్ రాశారట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నిజానికి ఆసియా కప్ 2023 టోర్నీ పాకిస్తాన్‌లో జరగాల్సింది. అయితే పాక్‌కు తమ జట్టును పంపడం కుదరదని బీసీసీఐ తేల్చి చెప్పింది. ఎన్నో చర్చల అనంతరం చివరకు హైబ్రీడ్ మోడల్‌లో పాక్, శ్రీలంక వేదికగా టోర్నీని పీసీబీ నిర్వహిహిస్తోంది. రెండో వేదికగా యూఏఈని ఎంపిక చేయాలని అప్పటి పీసీబీ చీఫ్ నజాం సేథీ కోరినా.. దానికి ఏసీసీ ఒప్పుకోలేదట. బీసీసీఐ ఒత్తిడితోనే శ్రీలంకలో సగం టోర్నీ నిర్వహించాలని ఏసీసీ నిర్ణయం తీసుకుందని సేథీ ఆరోపణలు చేశాడు.
ఆసియా కప్ 2023లో భారత్ ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు ఆడగా.. రెండు మ్యాచ్‌లకు వర్షం అంతరాయం కలిగింది. పాకిస్తాన్, భారత్ మ్యాచ్‌లో ఒక్క ఇన్నింగ్స్ మాత్రమే జరగ్గా.. నేపాల్, భారత్ మధ్య మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం ఫలితం వచ్చింది. నేపాల్, భారత్ మ్యాచ్‌కు పెద్దగా జనాలు రాలేదు. టిక్కెట్లు తక్కువగా అమ్ముడుకావడంతో టోర్నీ అంతగా ఆకట్టుకోలేకపోతోంది. మరోవైపు ప్రతికూల వాతావరణం కారణంగా సూపర్-4 మ్యాచులను కొలంబో నుంచి హంబంతోటకు మార్చాలని ఏసీసీ డిసైడ్ అయిందట. చివరకు ఎవరికీ చెప్పకుండా కొలంబోనే మ్యాచులు నిర్వహించాలని నిర్ణయం తీసుకుందని పీసీబీ చీఫ్ జాకా అష్రాఫ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
Also Read: Digene Gel: డైజీన్ సిరఫ్ తాగుతున్నారా తస్మాత్ జాగ్రత్త.. మార్కెట్ నుంచి కోట్ల బాటిళ్ల రీకాల్
ఏసీసీ సొంత నిర్ణయాలతో కలత చెందిన పీసీబీ.. కొలంబోలో టోర్నమెంట్‌ను కొనసాగించడానికి ఎవరు నిర్ణయం తీసుకున్నారనేది స్పష్టంగా తెలియలేదని, ఈ విషయంపై క్లారిటీ రావాల్సి ఉందంటూ ఏసీసీ అధ్యక్షుడు జై షాకు మెయిల్ చేసినట్లు చేస్తోంది. ఆసియా కప్ టోర్నీ ఆసాంతం తమను ఏసీసీ లెక్కచేయలేదని, కీలక విషయాల్లో నిర్ణయాలు తీసుకునేప్పుడు తమకు కనీసం సమాచారం ఇవ్వలేదని అసంతృప్తి వ్యక్తం చేసిందట. వర్షాల కారణంగా తమకు జరిగిన నష్టంకు పరిహారం కావాలంటూ పీసీబీ డిమాండ్ చేస్తోందట.