పాకిస్థాన్ ఎన్నికలు (Pakistan Elections) ఎంత గందరగోళంగా జరిగాయో ప్రపంచమంతటికీ తెలిసిందే. ఎన్నికలు జరగడం ఒకెత్తు అయితే.. ఆ తర్వాత టెస్టు మ్యాచ్‌లా ఫలితాలు విడుదల కావడం మరొకెత్తు. ఇక ప్రజలు కూడా ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఇవ్వలేదు. దీంతో అధికారం మాదేనంటూ ఇమ్రాన్‌ఖాన్-నవాజ్‌షరీఫ్ పార్టీలు చెప్పుకున్నా.. చివరాకరికి సైన్యం జోక్యంతో నవాజ్‌షరీఫ్ (Nawaz Sharif) పార్టీ వైపు మొగ్గు చూపింది.
మొత్తానికి బిలావల్ భుట్టో పార్టీ మద్దతుతో షరీఫ్ పార్టీ అధికారాన్ని అధికారాన్ని చేజిక్కించుకుంటున్నారు. ప్రధాని అయ్యే అవకాశం రానే వచ్చిందంటూ షరీఫ్ తెగ సంబరపడ్డారు. ఆయన కూడా ప్రధాని పీఠంపై కూర్చోవాలని తెగ ఆశపడ్డారు. కానీ ఆశ దోశ అప్పడం అన్న చందంగా ఆయన ఆశలు ఆవిరైపోయాయి. భలే ఛాన్స్ వచ్చింది అనే లోపు సైన్యం అడ్డుపుల్ల వేయడంతో వెనక్కి తెగ్గాల్సి వచ్చింది. సైన్యం పెట్టిన షరతుతో తన సోదరుడైన షెహబాజ్ షరీఫ్‌కు ప్రధాని పీఠాన్ని అప్పగించాల్సిన దుస్థితి ఏర్పడింది. దీనికి షరీఫ్ కుమార్తె కారణంగా తెలుస్తోంది. బిడ్డ కోసం ప్రధాని పీఠాన్ని కూడా వదులుకోవల్సిన పరిస్థితి వచ్చింది.
పాకిస్థాన్ (Pakistan) రాజకీయాలను ఆ దేశ సైన్యం శాసిస్తుందనేది బహిరంగ రహస్యమే. తాజాగా ఇది మరోసారి రుజువైంది. దేశ ప్రధానమంత్రిగా నాలుగోసారి బాధ్యతలు చేపట్టాలని కలలు కన్న నవాజ్ షరీఫ్ (Nawaz Sharif) చివరి నిమిషంలో వెనక్కి తగ్గారు. గత్యంతరం లేక ప్రధాని పదవికి తన సోదరుడు షహబాజ్ షరీఫ్‌ను నామినేట్ చేశారు. అయితే ఈ నిర్ణయం వెనక పాక్ ఆర్మీ హస్తం ఉన్నట్లు తేలింది. తన కుమార్తె మరియం రాజకీయ భవిష్యత్తు కోసమే నవాజ్ సైన్యానికి తలొగ్గినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
పాకిస్థాన్ ముస్లిం లీగ్- నవాజ్ (పీఎంఎల్-ఎన్) ఆధ్వర్యంలోని సంకీర్ణ ప్రభుత్వానికి నవాజ్ షరీఫ్ నేతృత్వం వహించారు. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో పార్టీ పేలవ ప్రదర్శన చేయడంతో ఆయనకు సైన్యం కండీషన్స్ పెట్టింది. ప్రధాని పదవి కావాలా? కుమార్తెకు పంజాబ్ ముఖ్యమంత్రి పీఠం కావాలా? అంటూ షరతు పెట్టింది. రెండింటిలో ఏదో ఒకటి ఎంచుకోవాలని ఆదేశించింది. ఒకవేళ ప్రధాని పదవిని ఎంచుకుంటే పంజాబ్ సీఎం పగ్గాలు షహబాజ్‌కు ఇవ్వాలని తేల్చిచెప్పింది. దీంతో సందిగ్ధంలో పడిన షరీఫ్.. తన కుమార్తె కోసం ప్రధాని పదవిని వదలుకునేందుకు సిద్ధమయ్యారు. తన రాజకీయ వారసురాలైన మరియం భవిష్యత్తు కోసం నవాజ్ ప్రధాని రేసు నుంచి వైదొలిగినట్లు పీఎంఎల్-ఎన్ పార్టీ నేత ఒకరు మీడియాకు వివరించారు.
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ దక్కలేదు. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మద్దుతున్న స్వతంత్రులు 92 స్థానాల్లో గెలుపొందగా.. నవాజ్ పార్టీ 80, బిలావల్ భుట్టో నేతృత్వంలోని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ 54 సీట్లు దక్కించుకుంది. దీంతో పీపీపీ, చిన్న పార్టీలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు పీఎంఎల్-ఎన్ సిద్ధమైంది.
మార్చి తొలివారంలో షహబాజ్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం కొలువుదీరనుంది. ఇక పంజాబ్ తొలి మహిళా ముఖ్యమంత్రిగా షరీఫ్ కుమార్తె మరియం బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే ప్రధానిగా షహబాజ్ ఉన్నా.. రాజకీయ చక్రం తిప్పేది నవాజ్ షరీఫే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.