Site icon NTV Telugu

IED Attack Pakistan: పాక్ ఆర్మీ కాన్వాయ్‌పై బాంబు దాడి.. కెప్టెన్ సహా ఆరుగురు మృతి

Pakistan Army

Pakistan Army

IED Attack Pakistan: వాయువ్య ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దులో ఉన్న కుర్రం గిరిజన జిల్లాలోని సుల్తానీ ప్రాంతంలో పాకిస్థాన్ భద్రతా దళాల కాన్వాయ్ లక్ష్యంగా బుధవారం IED పేలుడు దాడి జరిగింది. ఈ దాడిలో కెప్టెన్‌ సహా ఆరుగురు సైనికులు మరణించినట్లు పాకిస్థాన్ సైన్యం గురువారం ప్రకటించింది. పాకిస్థాన్ సైన్యం మీడియా విభాగం అయిన ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ISPR) మరణించిన వారి ఫోటోలను విడుదల చేసింది. బుధవారం కాన్వాయ్ ఆ ప్రాంతం గుండా వెళుతుండగా కాల్పులు జరిగాయి. ఎదురుకాల్పులు జరుగుతున్న సమయంలో డోగర్ సమీపంలో ఒక ఐఈడీ పేలింది. కాల్పుల సమయంలో ఆర్మీ ట్రక్కులకు నిప్పు పెట్టారు.

READ ALSO: Rahul Gandhi: పీఎం మోడీపై అనుచిత వ్యాఖ్యలు.. రాహుల్ గాంధీపై ఈసీకి బీజేపీ ఫిర్యాదు..

తాజాగా ISPR ఈ దాడిలో మరణించిన సైనికుల ఫోటోలను విడుదల చేసింది. వారిలో మెడికల్ ఆఫీసర్ కెప్టెన్ నోమన్ సలీం (24), హవిల్దార్ అమ్జాద్ అలీ (39), నాయక్ వకాస్ అహ్మద్ (36), అలాగే సిపాయిలు ఐజాజ్ అలీ (23), ముహమ్మద్ వలీద్ (23), ముహమ్మద్ షాబాజ్ (32) ఉన్నారు. అనంతరం పాకిస్థాన్ దళాలు జరిపిన ప్రతీకార కాల్పుల్లో ఏడుగురు ఉగ్రవాదులు మరణించారు. దీని తరువాత పాకిస్థాన్ భద్రతా దళాలు బలూచిస్థాన్‌లో రెండు వేర్వేరు ఆపరేషన్లు నిర్వహించి 18 మంది ఉగ్రవాదులను హతమార్చాయని పేర్కొంది. ISPR ప్రకారం.. బుధవారం రాత్రి క్వెట్టా జిల్లాలోని చిల్తాన్, కెచ్ జిల్లాలోని బులేడాలోని ఉగ్రవాద స్థావరాలపై భద్రతా దళాలు దాడి చేశాయి. ఈ భీకర ఎన్‌కౌంటర్‌లో చిల్తాన్‌లో 14 మంది, కెచ్‌లో నలుగురు ఉగ్రవాదులు మరణించారు.

ఇటీవలి కాలంలో పాకిస్థాన్‌లో ఉగ్రదాడులు పెరిగాయని అధికారులు పేర్కొన్నారు. ఈ దాడులు ఎక్కువగా ఖైబర్ పఖ్తున్ఖ్వా, బలూచిస్థాన్‌లో జరుగుతున్నాయి. ఈ దాడులన్ని పోలీసులు, పరిపాలన, సైనిక భద్రతా దళాలు లక్ష్యంగా చేసుకొని జరుగుతున్నాయి. నిషేధిత తెహ్రిక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్ ప్రభుత్వంతో 2022 కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన తర్వాత ఈ దాడులు పెరిగాయని చెబుతున్నారు. ISPR ప్రకారం.. ఆదివారం ఆఫ్ఘనిస్థాన్ నుంచి రెండు ప్రధాన ఉగ్రవాద చొరబాటు ప్రయత్నాలను భద్రతా దళాలు భగ్నం చేశాయి. ఈ క్రమంలో నలుగురు ఆత్మాహుతి బాంబర్లు సహా 25 మంది ఉగ్రవాదులు మరణించారు. ఉత్తర వజీరిస్తాన్, కుర్రం జిల్లాల్లో వేర్వేరు ఆపరేషన్లలో పెద్ద మొత్తంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు పాక్ అధికారులు పేర్కొన్నారు.

READ ALSO: Bihar Elections 2025: బీహార్‌లో హత్యా రాజకీయాలు.. ఎన్నికల ప్రచారంలో తూటాకు బలైన నాయకుడు

Exit mobile version