Naseem Shah Likely to Miss ODI World Cup 2023: ఆసియా కప్ 2023 టైటిల్ కొడుదామనుకున్న పాకిస్తాన్‌కు ఊహించని పరాయజం ఎదురైన విషయం తెలిసిందే. సూపర్-4లో శ్రీలంకతో చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో పరాజయం పాలై.. ఇంటిబాట పట్టింది. ఓటమి బాధలో ఉన్న పాకిస్తాన్‌కు.. వన్డే ప్రపంచకప్ 2023కి ముందు భారీ ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. గాయం కారణంగా యువ పేసర్ నసీమ్ షా మెగా టోర్నీకి దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సూపర్-4లో భాగంగా టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో నసీమ్ షా ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు. దాంతో తన కోటా ఓవర్లు పూర్తిచేయకుండానే మైదానాన్ని వీడాడు. గాయం కారణంగా శ్రీలంకతో జరిగిన కీలక మ్యాచ్‌లో బరిలోకి దిగలేదు. కుడి భుజం నొప్పితో విలవిల్లాడుతున్న నసీమ్ ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్నట్లు సమాచారం. అతడి రికవరీకి ఎంత సమయం పడుతుందో ఇప్పుడే చెప్పలేను అని పాక్ కెప్టెన్ బాబర్ ఆజామ్ పేర్కొన్నాడు. షా గాయం గురించి ఇంతవరకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) పూర్తి వివరాలు వెల్లడించలేదు. అయితే షా ప్రపంచకప్ 2023కి మొత్తం కాకపోయినా.. ఆరంభ మ్యాచ్‌లకు దూరం కానున్నాడని సమాచారం.
20 ఏళ్ల నసీమ్ షాకు గాయాలు కొత్తే కాదు. గతంలో వెన్నునొప్పి కారణంగా ఏకంగా 14 నెలలు ఆటకు దూరమయ్యాడు. పాకిస్తాన్‌కు కీలక బౌలర్‌గా ఉన్న షా.. ప్రపంచకప్ 2023కి ముందు గాయపడటం పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పాలి. వన్డేల్లో 14 మ్యాచ్‌లు ఆడి 32 వికెట్లు పడగొట్టాడు. మరో కీలక పేసర్ హారిస్ రవూఫ్ కూడా భారత్ మ్యాచ్‌లో గాయపడ్డాడు. పక్కటెముకల నొప్పితో ఇబ్బంది పడుతున్న రవూఫ్ మెగా టోర్నీ నాటికి కోలుకునే అవకాశం ఉంది.
Naseem Shah might miss the first few matches of the World Cup. [Espn Cricinfo]
– Bad news for Pakistan. pic.twitter.com/XcGAdQh0pd
— Johns. (@CricCrazyJohns) September 15, 2023