NTV Telugu Site icon

Pak Hikes Fuel Prices: పాక్‌ ప్రజలపై మరో బాంబ్.. లీటరు పెట్రోల్‌ ధర రూ.272

Pakistan

Pakistan

Pak Hikes Fuel Prices: ఆర్థిక సంక్షోభం పాకిస్థాన్ ప్రజలను ముప్పు తిప్పలు పెడుతోంది. ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు పడుతున్న పాక్ ప్రజలపై మరో బాంబు పేలింది. ఆ దేశ ప్రభుత్వం ఇంధన ధరలను భారీగా పెంచింది. గతనెల 29న లీటర్‌ డీజిల్‌, పెట్రోల్‌పై రూ.35 చొప్పున పెంచిన షెహబాజ్‌ షరీఫ్‌ సర్కారు.. తాజాగా పెట్రోల్‌పై రూ.22.20, హై స్పీడ్‌ డీజిల్‌పై రూ.17.20, కిరోసిన్‌పై రూ.12.90 చొప్పున వడ్డించింది. పాక్‌ రూపాయి విలువ దారుణంగా పడిపోవడంతో పెట్రోల్‌, డీజిల్‌తోపాటు నిత్యావసర పదార్థాల ధరలు పాకిస్థాన్‌లో ఆకాశాన్నంటాయి. అంత‌ర్జాతీయ ద్రవ్య నిధి (ఏఎంఎఫ్‌)తో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు మినీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన కొద్దిగంటల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరగడం గమనార్హం. పాకిస్తాన్ బుధవారం రాత్రి పెట్రోల్, గ్యాస్ ధరలను చారిత్రాత్మక గరిష్ట స్థాయికి పెంచింది,

పెట్రోలు ధర 22.20 రూపాయలు పెరిగిన తర్వాత లీటరుకు రూ. 272కు పెంచబడింది, డాలర్‌తో రూపాయి విలువ క్షీణించడం వల్ల ఈ పెరుగుదల చోటుచేసుకుందని ఆర్థిక విభాగం నుంచి ఓ పత్రికా ప్రకటన వెలువడింది. 17.20 రూపాయల పెంపు తర్వాత హైస్పీడ్ డీజిల్ ధర లీటరుకు 280 రూపాయలకు పెరిగింది. 12.90 రూపాయల పెంపు తర్వాత కిరోసిన్ నూనె ఇప్పుడు లీటరుకు 202.73 రూపాయలకు అందుబాటులో ఉంటుంది. కాగా, తేలికపాటి డీజిల్ ఆయిల్ 9.68 రూపాయలు పెరిగిన తర్వాత లీటరుకు 196.68 రూపాయలకు అందుబాటులో ఉంటుంది. కొత్త ధరలు గురువారం నుంచి అమల్లోకి వచ్చాయని తెలిసింది.

Philippines: ఫిలిప్పీన్స్‌లో భూకంపం.. 80కి పైగా ప్రకంపనలు

మూడీస్ అనలిటిక్స్‌తో సంబంధం ఉన్న సీనియర్ ఆర్థికవేత్త కత్రీనా ఎల్, 2023 ప్రథమార్థంలో పాకిస్థాన్‌లో ద్రవ్యోల్బణం సగటున 33 శాతంగా ఉండవచ్చని అంచనా వేసింది. “మినీ-బడ్జెట్” ద్వారా, పాకిస్తాన్ డెమోక్రటిక్ మూవ్‌మెంట్ (PDM) నేతృత్వంలోని సమాఖ్య ప్రభుత్వం బడ్జెట్ లోటును తగ్గించడం, పన్నుల వసూళ్లను విస్తృతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఫెడరల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ (FBR) 115 బిలియన్ రూపాయల విలువైన పన్నులను వసూలు చేయడానికి ప్రామాణిక 17 శాతం సాధారణ అమ్మకపు పన్ను (GST)ని 18 శాతానికి పెంచుతూ ఎస్‌ఆర్వో జారీ చేసింది. పాక్‌కు నిధుల విడుదల కోసం అంతర్జాతీయ ద్రవ్య నిధి.. ఆర్థిక క్రమశిక్షణ పేరిట పాక్ ప్రభుత్వానికి పలు నిబంధనలు విధించింది. ఇందులో భాగంగా పాకిస్థాన్ ప్రభుత్వం ఇటీవలి మినీ బడ్జెట్‌లో పన్నులను పెంచింది. తాజాగా ఇంధన ధరలూ భారీగా పెంచడంతో పాక్ ప్రజల లబోదిబోమంటున్నారు.