పహల్గాం సమీప బైసరన్ లోయలో జరిగిన ఉగ్రదాడి తనను తీవ్రంగా కలచివేస్తోందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఉగ్రదాడి మృతుల కుటుంబాలకు జనసేన అధినేత ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో అందరం దృఢంగా ఉందాం అని, మన భారత ఐక్యతను ఉగ్రవాదం విచ్ఛిన్నం చేయలేదని పేర్కొన్నారు. ఉగ్రదాడిలో మరణించిన వారి గౌరవార్థం జనసేన పార్టీ తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు సంతాప దినాలను పాటిస్తుందని పవన్ కల్యాణ్ చెప్పారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో బైసరన్ లోయలోకి సైనిక దుస్తుల్లో వచ్చిన ముష్కరులు.. పర్యాటకులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు.
ఉగ్రదాడిని ఖండిస్తూ మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పార్టీ జెండాను పవన్ కల్యాణ్ అవనతం చేశారు. ‘పహల్గాంలో జరిగిన దాడి నన్ను తీవ్రంగా కలచివేస్తోంది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. చనిపోయిన వారి గౌరవార్థం జనసేన పార్టీ తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు సంతాప దినాలను పాటిస్తుంది. పార్టీ జెండాను అవనతం చేస్తున్నాం. ఈ క్లిష్ట సమయంలో అందరం దృఢంగా ఉందాం, మన భారత ఐక్యతను ఉగ్రవాదం విచ్ఛిన్నం చేయలేదు. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది. ఇలాంటి దారుణాలు మరలా జరగకుండా చూడాలి. భారత సాయుధ దళాలపై పూర్తి నమ్మకం ఉంది. సమష్టిగా మనం దీన్ని అధిగమిద్దాం, కలిసి కట్టుగా ఉందాం’ అని పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.