టెస్టు మ్యాచ్‌లో ఉన్న మజానే వేరు. చివర్లో విజయం కోసం రెండు జట్లు ఎంతో పట్టుదల ప్రదర్శించాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రత్యర్థిని నిర్ణీత ఐదు రోజుల్లో కట్టడి చేయలేకపోతే మ్యాచ్ డ్రాగా మిగిలిపోతుంది. మిగతా ఫార్మాట్లలో అయితే ఎలాగైనా విజేతను నిర్ణయించే అవకాశం ఉంది. కానీ టెస్టుల్లో అది లేదు. మ్యాచ్ డ్రా అయిందంటే.. డ్రా అంతే. అందుకే గెలిచేందుకు అన్ని జట్లు చాలా కష్టపడతాయి. తాజాగా వెస్టిండీస్, జింబాబ్వే మధ్య జరిగిన టెస్టు మ్యాచ్‌లో కూడా అలాంటి దృశ్యమే కనిపించింది. ఈ టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన విండీస్ భారీ స్కోరు చేసింది. టెగనరైన్ చందర్‌పాల్ డబుల్ సెంచరీ చేయడంతో 447/6 స్కోరు వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. అనంతరం జింబాబ్వే తొలి ఇన్నింగ్సులో 379/9 వద్ద డిక్లేర్ చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో విండీస్ 203/5 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి, జింబాబ్వే ముందు మంచి టార్గెట్ ఉంచింది. దీంతో మ్యాచ్ డ్రా చేసుకునేందుకు జింబాబ్వే ప్రయత్నించింది. ఆట ముగిసే సరికి 134/6 స్కోరుతో మ్యాచ్ డ్రా చేసుకుంది.
Also Read: KS Bharat: ద్రవిడ్ మాటలు నా కెరీర్‌ను మార్చేశాయి: కేఎస్ భరత్
అయితే, ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని విండీస్ జట్టు రకరకాల ప్రయోగాలు చేసింది. ఐదో రోజు ఆటలో పిచ్ నుంచి స్పిన్నర్లకు సహకారం అందుతోందని చూసి కొత్త ప్లాన్ కూడా వేసింది. దీనిలో భాగంగానే ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ జేసన్ హోల్డర్ ఆశ్చర్యకరంగా స్పిన్ బౌలింగ్ వేశాడు. సాధారణంగా మీడియం పేస్ బౌలింగ్ వేసే హోల్డర్.. పిచ్‌ను తనకు అనుకూలంగా వాడుకోవాలనే ఆలోచనతో ఆఫ్‌స్పిన్ బౌలింగ్ చేశాడు. వికెట్లేమీ తీయలేకపోయినా.. తను వేసిన రెండు ఓవర్లలో కేవలం ఆరు పరుగులే ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇన్ని చేసినా విండీస్ చివరకు మ్యాచ్ గెలవలేకపోవడంపై నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు.