Flash Floods In Rwanda: తూర్పు ఆఫ్రికా దేశమైన రువాండాలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఉత్తర, పశ్చిమ రువాండాలో వరదల కారణంగా కనీసం 109 మంది మరణించారని స్థానిక అధికారుల గణాంకాలు తెలిపాయి. ఈ మేరకు ప్రభుత్వ నిర్వహణలోని రువాండా బ్రాడ్‌కాస్టింగ్ ఏజెన్సీ (RBA) తెలిపింది. మంగళవారం రాత్రి కురిసిన వర్షం ఉత్తర, పశ్చిమ ప్రావిన్స్‌లలో విపత్తుకు కారణమైందని ఆర్బీఏ తన వెబ్‌సైట్‌లో ప్రకటించింది. పశ్చిమ ప్రావిన్స్‌లో 95 మంది, ఉత్తర ప్రావిన్స్‌లో మరో 14 మంది మరణించారని.. వరద నీరు కారణంగా ఇళ్లు కొట్టుకుపోయాయని తెలిసింది. చాలా ప్రాంతాల్లో రహదారులు కొట్టుకుపోగా రవాణా సదుపాయాలకు అంతరాయం కలిగిందని ఆ దేశ మీడియా పేర్కొంది.
Read Also: School Shooting: స్కూల్‌లో విద్యార్థి కాల్పులు.. 8 మంది పిల్లలు, గార్డు హతం
ఈ వరదల వల్ల ఇళ్లు ధ్వంసం కాగా.. కొండచరియలు విరిగిపడ్డాయి. రోడ్లు తెగిపోవడంతో పాటు పొలాలు ముంపునకు గురయ్యాయి. “విపత్తులో మృతి చెందినవారిని పూడ్చిపెట్టడంలో సహాయం చేయడం, ఇళ్లు ధ్వంసమైన వారికి సామాగ్రిని అందించడం వంటి సహాయక చర్యలు వెంటనే ప్రారంభమయ్యాయి” అని అత్యవసర నిర్వహణ బాధ్యత మంత్రి మేరీ సోలాంగే కైసిరే తెలిపారు. మే 2020లో, తూర్పు ఆఫ్రికాలో భారీ వర్షాలు కురుస్తుండటంతో, కెన్యాలో కనీసం 194 మంది మరణించగా.. రువాండాలో కనీసం 65 మంది మరణించారు.