లోక్సభ ఎన్నికల ఫలితాల పైన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. పార్టీ స్థాపించి 24 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానంలో అన్ని రకాల ఎత్తుపల్లాలను చూశామన్నారు. అద్భుతమైన విజయాలతో పాటు అనేక ఎదురుదెబ్బలు, ఎదుర్కొన్నామన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే మాకు అతి పెద్ద గౌరవమని తెలిపారు. ఒక ప్రాంతీయ పార్టీగా వరుసగా రెండుసార్లు అద్భుతమైన మెజార్టీలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నామని గుర్తుచేశారు. 2014లో 63 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే 2018లో 88 స్థానాలతో రెండవసారి ప్రభుత్వాన్ని విజయవంతంగా ఏర్పాటు చేశామన్నారు. ప్రస్తుతం శాసనసభలో 39 సీట్లతో 1/3 స్థానాలతో ప్రధాన ప్రతిపక్షంగా కొనసాగుతున్నామని చెప్పారు. ఈరోజు వచ్చిన ఎన్నికల ఫలితాలు కచ్చితంగా నిరాశను కలిగించాయని కేటీఆర్ స్పష్టం చేశారు. అయినా ఎప్పటిలాగే మరింత కష్టపడి ఉన్నత శిఖరాలకు చేరుకుంటామన్నవిశ్వాసం ఉందన్నారు. ఫీనిక్స్ పక్షి లెక్క తిరిగి పుంజుకుంటామని తెలిపారు.
READ MORE: Konda Surekha: కక్షపూరితమైన పాలన తోనే జగన్ పరాజయం.. కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు
కాగా.. 2014లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి రాష్ట్రాన్ని ఏలిన కె.చంద్రశేఖర్ రావు ఇంటి బాట పడుతున్నారు. అయితే.. భారత రాష్ట్ర సమితి (BRS) లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 17 పార్లమెంటరీ స్థానాల్లో ఒక్కటి కూడా గెలిచే అవకాశం కనిపించడం లేదు. కనీసం ఆధిక్యం దరిదాపుల్లోకి కూడా బీఆర్‌ఎస్‌కు చెందిన నేతలు రాకపోవడం గమనార్హం. తెలంగాణలో ఈ లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ నెలకొంది. ఒక్కొక్కటి ఎనిమిది స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. మిగిలిన సీటు, హైదరాబాద్, AIMIM యొక్క కంచుకోట, ఇక్కడ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆధిక్యంలో ఉన్నారు.