Site icon NTV Telugu

Uttar Pradesh: విషాదం.. ఆలయ గోడ కూలి శిథిలాల కింద నలుగురు సమాధి..!

Up Wall

Up Wall

ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌లో విషాదం చోటు చేసుకుంది. రోడ్డుకు ఆనుకుని ఉన్న చిత్రగుప్త దేవాలయం గోడ కూలిపోయింది. ఈ సమయంలో అక్కడ రోడ్డు నిర్మాణం పనులు చేస్తున్న కార్మికులపై పడింది. దీంతో.. నలుగురు కూలీలపై శిథిలాలు పడ్డాయి. భారీ శబ్దం రావడంతో.. వెంటనే స్థానికులు అక్కడికి చేరుకుని శిథిలాల నుండి కూలీలను బయటకు తీసి ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఓ కూలీ చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. మరో ముగ్గురు కూలీలకు చికిత్స అందుతోంది.

Read Also: Rishabh Pant: ధోనీ రికార్డును సమం చేసిన టీమిండియా వికెట్ కీపర్..

కొత్వాలి నగర్‌లోని సీతాకుండ్‌లో ఈ ఘటన జరిగింది. అక్కడ రోడ్డు నిర్మాణ పనులను మున్సిపాలిటీ కాంట్రాక్టర్ అజయ్ సింగ్ చేయిస్తున్నారు. ప్రతిరోజు మాదిరిగానే ఈరోజు కూడా రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం కాగా, మధ్యాహ్నం రోడ్డు పక్కనే ఉన్న ఆలయ గోడ ఒక్కసారిగా కూలిపోయింది. గోడ కూలిపోవడంతో రోడ్డు నిర్మాణంలో నిమగ్నమైన కూలీలు సమీపంలోనే ఉండడంతో నలుగురు కూలీలు గోడ కింద సమాధి అయ్యారు. కార్మికులు రక్షించాలని కేకలు చేయడంతో స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని ఆస్పత్రికి తరలించారు.

Matrimonial frauds: మ్యాట్రిమోనీ మోసం.. ఏకంగా 50 మంది మహిళల ట్రాప్..

కాగా.. మృతి చెందిన కార్మికుడు పంకజ్ నిషాద్ (17)గా గుర్తించారు. గాయపడిన వారిలో కొత్వాలి నగర్‌కు చెందిన సోహన్‌లాల్ నిషాద్ (30), రాము నిషాద్ (18), ఛోటు నిషాద్ (17) ఉన్నారు. ఈ ఘటనలో మైనర్‌తో పనులు చేయించుకుంటున్న విషయం వెలుగులోకి రావడంతో కాంట్రాక్టర్‌ పై తీవ్ర చర్యలు తీసుకోనున్నారు. గతంలో ఆడిటోరియం నిర్మాణంలో ఓ కూలీ మృతి చెందాడు. కాగా.. ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

Exit mobile version