అబ్దుల్లాపూర్‌మెట్టు, కుంట్లూరులో జరిగిన ఘోరమైన అగ్నిప్రమాదంలో ఇండ్లు కోల్పోయిన వారికి తక్షణ సహాయం క్రింద లక్ష రూపాయలు ఇవ్వాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. శనివారం రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్‌మెంట్ రెవెన్యూ పరిధిలోని కుంట్లూరు వద్ద గల రావినారాయణ రెడ్డి కాలనీలో జరిగిన అగ్ని ప్రమాద స్థలాన్ని సాంబశివరావు పరిశీలించి, బాధిత కుటుంబాలను ఓదార్చారు. ఈ ఘోర అగ్నిప్రమాదంలో దాదాపు 300ల వరకు గుడిసెలు కాలి పోయాయని, గ్యాస్ సిలెండర్స్ పేలడం వలన ప్రమాద తీవ్ర ఎక్కువైందని అన్నారు. గుడిసెలు వేసుకున్న వారందరూ కష్టజీవులని, ఇండ్లలలో పనిచేసేవారు, ఆటోలు నడిపేవారని పేర్కొన్నారు.
Also Read:BJP MP: ‘‘పాకిస్తాన్ 4 ముక్కలు అవుతుంది’’.. నిషికాంత్ దూబే సంచలనం..
భూ మాఫీయా నుంచి ఈ భూమిని రక్షించి పేదలు, బడుగు బలహీనవర్గాల ప్రజలు కమ్యూనిస్టు పార్టీ నీడన రాష్ట్రంలోని వేరువేరు ప్రాంతాల నుంచి వచ్చి గుడిసెలు వేసుకున్నారని ఇప్పుడు ఆ గుడిసెలు కాలి పోవడం వలన వీధిన పడ్డారని అన్నారు. కలెక్టర్,రెవెన్యూ, పోలీస్ ఆధికారులు పరిశీలించారని, కలెక్టర్ తక్షణ సహాయం క్రింద ఆరున్నర వేలు ఇస్తామన్నారని, ఇంకా ప్రభుత్వంతో ఇంకా కొంత ఇప్పిస్తామని చెప్పారన్నారు. ఈ డబ్బు ఏమాత్రం సరిపోదని, ఆపదలో వున్న వారిని ఆదుకోవాల్సిన కర్తవ్యం ప్రభుత్వంపైన ఉన్నదని వారు పేర్కొన్నారు. పార్టీ ప్రతినిధి బృందాన్ని ముఖ్యమంత్రి దగ్గరకు తీసుకువెళ్ళి పూర్తి నష్టపరిహారం ఇప్పిస్తానని అన్నారు.
Also Read:Sperum Count: సంతానం కలగాలంటే వీర్యకణాల సంఖ్య ఎంత ఉండాలంటే!
ఈ భూమిని భూమాఫీయాలు కొట్టేయకుండా పార్టీ అడ్డుకున్నదని, ఈ కేసు కోర్టులో ఉన్నదని ప్రభుత్వం చొరవ తీసుకొని పరిష్కరించాలని తెలిపారు. ఇక్కడ కరెంట్, మంచినీటి వసతి లేదని, రోహింగ్యాలకు సైతం మంచినీరు ఇస్తున్నామని, మన రాష్ట్ర ప్రజలకు ఇవ్వకుండా ఉండటం దురదృష్టకరమని, ప్రభుత్వం మానవీయకోణంలో ఆలోచించాలని అన్నారు. ఇక్కడ దాదాపు 100 ఎకరాలలో 8 వేల మంది గుడిసెలు వేసుకొని నివసిస్తున్నారని వారందరికి పట్టాలు ఇచ్చి మౌళిక వసతులు కల్పించాలని సాంబశివరావు డిమాండ్ చేశారు.