NTV Telugu Site icon

Voter List: ఓటర్ల జాబితాలో అవకతవకలపై వైసీపీ, టీడీపీ పరస్పర ఫిర్యాదులు

Voter List

Voter List

Voter List: ఏపీలో ఓటర్ల జాబితాలో అవకతవకలపై మరోసారి వైసీపీ, టీడీపీ పరస్పర ఫిర్యాదులు చేసుకున్నాయి. కొత్త ఆరోపణలను రెండు పార్టీలు తెరపైకి తెచ్చాయి. వైసీపీలో మారిన ఇన్‌ఛార్జ్‌లు తమ అనుచరులను కొత్త నియోజకవర్గాల్లో ఓటర్లుగా చేరుస్తున్నారని టీడీపీ ఆరోపించింది. జనసేనకు ఇచ్చే సీట్లలోని టీడీపీ ఓటర్లను వేరే నియోజకవర్గాలకు మారుస్తున్నారని వైసీపీ ఆరోపించింది. సీఈఓ మీనాకు ఇరు పార్టీలు ఈ మేరకు ఫిర్యాదు చేశాయి. రాజకీయ పార్టీల ప్రతినిధులతో సీఈఓ ఎంకే మీనా భేటీ అయ్యారు. తుది ఓటర్ల జాబితాను పార్టీ ప్రతినిధులకు అందచేశారు. వైసీపీ నుంచి అప్పిరెడ్డి, మూర్తి, టీడీపీ నుంచి వర్ల రామయ్య, అశోక్ బాబు హాజరయ్యారు. సీఈఓతో భేటీకి కాంగ్రెస్, సీపీఎం పార్టీల ప్రతినిధులు కూడా హాజరయ్యారు.

Read Also: AP CEO MK Meena: ఓట్ల జాబితాపై వచ్చిన ఫిర్యాదుల్లో చాలా వరకు పరిష్కరించాం..

ప్రస్తుతం ఇచ్చిన ఓటర్ల తుది జాబితాలో ఇంకా అవకతవకలు ఉన్నాయని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారపు. గిరీషా వంటి కలెక్టర్ల మీదే కాదు.. తప్పు చేసిన ఇంకొందరు ఐఏఎస్, ఐపీఎస్‌ల మీద చర్యలు తీసుకోవాలన్నారు. సీఎం జగన్ చేసిన ఎమ్మెల్యేల ట్రాన్స్‌ఫర్ల వల్ల ఓట్ల జాబితాలో అవకతవకలకు తెర లేపే అవకాశం కన్పిస్తోందన్నారు. మంత్రి రజని చిలకలూరి పేట ఓటర్లని గుంటూరు వెస్టుకు మార్పు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మంత్రి మేరుగ, ఎమ్మెల్యే వెల్లంపల్లిలు కూడా తమ సొంత నియోజకవర్గం ఓటర్లను తమకు టిక్కెట్ కేటాయించిన సెగ్మెంట్లకి మారుస్తున్నారన్నారు. ఇలా తప్పిదాలు చేస్తే.. గిరీషా తరహాలోనే చర్యలు తప్పవన్నారు. ఓటర్ల జాబితాలో ఇంకా కొన్ని తప్పిదాలు ఉన్నాయని.. వీలైనంత త్వరగా సరి చేస్తామని సీఈఓ చెప్పారన్నారు. యువ ఓటర్లు తక్కువగా ఉన్నారన్న ఆయన.. యువత భవిష్యత్తును నిర్ణయించేది ఓటేనని ఆయన వ్యాఖ్యానించారు. అలాంటి ఓటు అనే ఆయుధాన్ని యువత పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. ఇంకా సమయం ఉంది.. యువకులు తమ ఓట్లను నమోదు చేసుకోవాలని సూచించారు. నియోజకవర్గ స్థాయిలో కూడా ఎన్నికల సంఘం సమావేశాలు పెట్టాలన్నారు.

Read Also: AP Bandh: అంగన్వాడీలకు మద్దతుగా 24న రాష్ట్ర బంద్‌కు పిలుపు

చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేయడంలో సిద్దహస్తుడని వైసీపీ ఎమ్మెల్సీ అప్పిరెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ఎన్నికలు ముగిసిన తర్వాత అక్కడి ఓటర్లని ఏపీలో ఓట్లు నమోదు చేయిస్తోంది టీడీపీనేనని ఆయన వెల్లడించారు. ఏపీలో స్థిర నివాసం ఉండే వారికే ఓట్లు ఉండేలా చూడాలని కోరామన్నారు. జనసేన పోటీ చేసే చోట్ల ఉన్న టీడీపీ ఓటర్లను టీడీపీ పోటీ చేసే నియోజకవర్గాల్లో నమోదు చేస్తున్నారన్నారు. వైసీపీలో కీలకంగా ఉన్న 10 లక్షల మంది ఓటర్లను తొలగించాలని టీడీపీకి చెందిన కోనేరు సురేష్ ఫిర్యాదు చేశారని.. కోనేరు సురేష్ వల్ల ఎన్నికల సంఘం సమయాన్ని వృధా చేశారని విమర్శించారు. కోనేరు సురేష్‌పై చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. విడదల రజనీ, మేరుగ, వెల్లంపల్లి వంటి వారు ఓటర్లను మార్చుకోవాల్సిన అవసరం మాకు లేదన్నారు. మేం 175 సెగ్మెంట్లు గెలిచేలా ఆలోచన చేస్తున్నామన్నారు. ఈ తరహా మార్పులు చేర్పులు.. టీడీపీకే అవసరమన్నారు. జనసేన నియోజకవర్గాల్లోని ఓట్లను తాము పోటీ చేసే సెగ్మెంట్లకు టీడీపీనే మార్చుకుంటోందన్నారు. టూరిస్టుల్లా ఏపీకి వచ్చే చంద్రబాబు, లోకేష్, పవన్ ఓట్లే తొలగించాలని ఆయన అన్నారు.