వైసీపీ అధిష్టానానికి తత్వం బోథపడిందా? ఎన్నికలకు ముందు చేసిన ప్రయోగాలన్నీ వికటించాయన్న సంగతిని గ్రహించిందా? చేతులు కాలాకైనా ఆకులు పట్టుకుని కాస్త ఉపశమనం పొందుదామని అనుకుంటోందా? ఆ క్రమంలోనే ప్రస్తుతం పార్టీలో మార్పులు చేర్పులు జరుతున్నాయా? ఇంతకీ వైసీపీ పెద్దల్లో వచ్చిన ఛేంజ్ ఏంటి? జరుగుతున్న పరిణామాలు ఎలా ఉన్నాయి? 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల ఎంపిక దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఏకంగా 82 సిట్టింగ్ సీట్లను అప్పట్లో మార్చారు జగన్. ఇందులో కొందరికి టిక్కెట్స్ నిరాకరించగా… కొందరి నియోజకవర్గాలు మారాయి. ఓ పది చోట్ల
పేదలు, సామాన్యులు, పార్టీ కార్యకర్తలకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి సరికొత్త ప్రయోగం చేశారు వైసీపీ అధ్యక్షుడు. ఉదాహరణకు అనంతపురం జిల్లా మడకశిరలో ఉపాధి హామీ కూలీగా ఉన్న ఈర లక్కప్పకు వైసీపీ టిక్కెట్ దక్కింది. ఇదే జిల్లా శింగనమలలో టిప్పర్ డ్రైవర్ కు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు జగన్. ఎన్టీఆర్ జిల్లా మైలవరం టికెట్‌ను జడ్పీటీసీగా ఉన్న సర్నాల తిరుపతిరావుకు, బెజవాడ పశ్చిమ సీటులో మాజీ కార్పొరేటర్ షేక్ ఆశిఫ్ కు టికెట్లను ఇచ్చారు. ఇలా.. అప్పుడు సవాలుతో కూడిన సరికొత్త ప్రయోగం చేశారనే చర్చ జరిగింది. అసలు కార్పొరేటర్ అవుతామని కూడా ఊహించని వాళ్ళకు ఎమ్మెల్యే టికెట్లను ఇవ్వటం ద్వారా మాది సామాన్యుల పార్టీ అన్న ఇమేజ్ కోసం జగన్ ప్రయత్నించారన్న చర్చ సైతం జరిగింది.
ఇదే విధంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు కేటాయింపు వ్యవహారంలో కూడా జగన్ కొత్త విధానానికి తెర తీశారన్నది అప్పట్లో పొలిటికల్ సర్కిల్స్‌లో జరిగిన చర్చ. సిట్టింగ్ ఎమ్మెల్యేలను తాము గెలిచిన చోట కాకుండా వేరే నియోజకవర్గాలకు పంపడంసంచలనం రేపింది. ఉదాహరణకు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సిట్టింగ్ వెలంపల్లి శ్రీనివాసరావుకు అక్కడ నుంచి తప్పించి సెంట్రల్ సీటు కేటాయించారు. అక్కడ అప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేగ ఉన్న మల్లాది విష్ణుకి టికెట్ ఇవ్వకుండా పక్కన పెట్టేశారు. అప్పటి మంత్రులు మేకతోటి సుచరిత, జోగి రమేష్, మేరుగ నాగార్జున, అనిల్, ఆదిమూలపు సురేష్ ఇలా అనేక మందికి స్థాన చలనం కలిగించగా అంతా ఓడిపోయారు. అటు సామాన్యులకు ఇచ్చిన టికెట్లలో కూడా పరాజయమే పార్టీని పలకరించింది. ఆ దెబ్బకు పార్టీ అధిష్టానానికి జ్ఞానోదయం అయి మేటర్ తెలిసి వచ్చిందన్నది పార్టీలో జరుగుతున్న తాజా చర్చ. ప్రయోగాలు వికటించినందున ఇప్పుడు నియోజకవర్గ ఇన్ఛార్జ్‌ల విషయంలో పాత పద్ధతినే ఫాలో అవ్వాలనుకుంటున్నారట. ప్రస్తుతం వైసీపీకి 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరికి తోడు వచ్చే ఐదేళ్ళు ప్రభుత్వంపై పోరాడటం, అలాగే నియోజకవర్గాల్లో పార్టీని బతికించాలంటే… బలమైన నేతలే కావాలన్న సంగతి అధినాయకత్వాని తెలిసివచ్చిందన్నది వైసీపీ ఇంటర్నల్ టాక్.
ఇన్ఛార్జ్‌ల విషయంలో ఎన్నికల టైంలో చేసిన ప్రయోగాలు చేస్తే… మొదటికే మోసం వస్తుందన్న సంగతి కూడా గుర్తించిందట వైసీపీ అధిష్టానం. అందుకే ఇన్ఛార్జ్‌ల విషయంలో స్థానికతకే ప్రాధాన్యం ఇస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఎప్పటికప్పుడు ఆందోళనలు చేయటంతోపాటు పార్టీ క్యాడర్ ను నియోజకవర్గ వ్యాప్తంగా ఒకే తాటిపైకి తేవటం అంటే చిన్న విషయం కాదని, పైగా పార్టీ కార్యక్రమాల నిర్వహణ ఖర్చు కూడుకున్న వ్యవహారం కాబట్టి పాత పద్ధతినే అవలంభించాలనుకుంటున్నారట వైసీపీ పెద్దలు. ఎన్నికలకు ముందు ఎవరు ఎక్కడ సిట్టింగ్‌లుగా ఉన్నారో… వాళ్ళందర్నీ తిరిగి సొంత నియోజకవర్గాలకు పంపే కార్యక్రమం మొదలైందంటున్నారు. విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన వెలంపల్లి శ్రీనివాస్‌కు ఇప్పుడు ఆయన పాత నియోజకవర్గం పశ్చిమకే పంపి ఇన్ఛార్జ్‌ని చేశారు. అలాగే జోగి రమేష్ పెనమలూరు నుంచి పోటీ చేయగా ఇప్పుడు ఆయన స్వస్థలమైన మైలవరం ఇన్చార్జిగా నియమించారు. ఇక గత ఎన్నికల్లో టికెట్ ఇవ్వకుండా పక్కన పెట్టిన మల్లాది విష్ణుకు సెంట్రల్ బాధ్యతలు ఇచ్చేశారు. ఇలా… వచ్చే జనవరి నాటికి అన్ని నియోజకవర్గాలకు సమర్థులైన నేతలను ఇన్చార్జిలుగా నియమంచి ప్రజల్లోకి వెళ్లేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారట జగన్. గతంలో తీసుకున్న నిర్ణయాల వల్ల జరిగిన నష్టాన్ని తాజా నిర్ణయాలతో అధిగమించవచ్చని వైసీపీ అధిష్టానం అంచనాగా తెలుస్తోంది. గతంలో నియోజకవర్గాలు మార్చారన్న అసంతృప్తితో ఉన్న కొందరు నేతలు ఇప్పుడు మనస్ఫూర్తిగా పని చేస్తారా? లేక మా అవసరం ఇప్పుడు తెలిసొచ్చిందా అంటూ వెయిట్ అండ్ సీ అన్నట్టుగా ఉంటారా అన్నది చూడాలంటున్నారు రాజకీయ పరిశీలకులు