Off The Record: పార్టీ మీటింగ్‌లంటే తెలంగాణ కమలం నేతలకు మొహం మొత్తిందా? వాటితో అయ్యేది లేదు.. పొయ్యేది లేదంటూ లైట్ తీసుకుంటున్నారా? స్వయంగా రాష్ట్ర అధ్యక్షుడు నిర్వహించిన సమావేశానికి ఏకంగా ఏడుగురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడాన్ని ఎలా చూడాలి? రాష్ట్ర బీజేపీలో ఏం జరుగుతోంది?
తెలంగాణ కమలం పార్టీలో ఇంకా స్తబ్దత పోలేదు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఫర్వాలేదనిపించినా… ఆ పార్టీ కేడర్ ఇంకా యాక్టివ్ మోడ్ లోకి రాలేదు. ఏదో …నామ్ కే వాస్తేగా పార్టీ కార్యక్రమాలు జరుగుతున్నాయట.అగ్ర నాయకత్వం ఎంత ఫాలో ఆప్ చేసినా… వెంటపడుతున్నా… క్షేత్ర స్థాయిలో మాత్రం పెద్దగా ఉలుకూపలుకు ఉండడం లేదంటున్నారు. ఏదైనా కార్యక్రమానికి పిలుపునిస్తే… ఆ…. చేద్దాంలే అంటున్నారట. అదే పార్టీ మీటింగ్ అంటే…ఇంకా వెనకడుగు వేస్తున్నట్టు తెలిసింది. ఆ మీటింగ్‌లతో అయ్యేది లేదు పొయ్యేది లేదంటూ పెదవి విరుస్తున్నట్టు తెలిసింది. తాజాగా మంగళవారం బీజేపీ స్టేట్ ఆఫీస్ బేరర్స్ మీటింగ్ జరిగింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా హర్ ఘర్ తిరంగా పై చర్చ జరిగింది.. ఈ సమావేశానికి సంబంధించిన సమాచారం రెండు మూడు రోజుల ముందుగానే సంబంధిత వ్యక్తులకు వెళ్ళింది. ఇందులో ఎమ్మెల్యేలు కూడా పాల్గొంటారని బీజేపీ రాష్ట్ర కార్యాలయం ప్రకటించింది కూడా… అయితే చివరికి నిజామాబాద్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా మినహా ఎవరు హాజరు కాలేదు..మిగతా అంతా… మీటింగ్ ను లైట్‌గా తీసుకున్నారన్న సమాచారం పార్టీ వర్గాల్లో కలకలం రేపుతోంది.
వ్యయ ప్రయాసలకు ఓర్చి మీటింగ్‌కు వెళ్ళినా… అక్కడ ఒరిగేదేం లేదు, అయ్యేది, పొయ్యేది లేని కార్యక్రమం కోసం అనవసరంగా ఆయాస పడటం దేనికన్న అభిప్రాయం పార్టీ ఎమ్మెల్యేలకే ఉందట.పెద్దగా నిర్ణయాలు తీసుకునేది ఉండదని, సరైన గౌరవం కూడా దక్కనప్పుడు వెళ్ళడం ఎందుకుకునే వాళ్ళు డుమ్మా కొట్టారన్న చర్చ జరుగుతోందట తెలంగాణ బీజేపీ వర్గాల్లో. అయినాసరే…రాష్ట్రంలో పార్టీకి ఉన్నదే 8మంది ఎమ్మెల్యేలు. అందులో ఏడుగురు మీటింగ్ రాకపోవడమంటే మరీ అంత నిర్లక్ష్యమా అన్న టాక్ నడుస్తోంది. అదే సమయంలో… పార్టీ అధినాయకత్వానికి, ఎమ్మెల్యేలకు మధ్య గ్యాప్ ఉందా అన్న గుసగుసలు సైతం వినిపిస్తున్నాయి. పార్టీ నాయకత్వం అంటే ఎమ్మెల్యేలకు కనీస గౌరవం లేదా అన్న ప్రశ్నలు సైతం వస్తున్నాయి. అయితే నిన్న మొన్నటిదాకా అసెంబ్లీ సమావేశాల కోసం హైదరాబాద్ లోనే ఉన్నామని, ఇప్పుడే నియోజకవర్గాలకు వస్తే… వెంటనే మీటింగ్ పేరుతో రమ్మంటే ఎలాగన్నది ఎమ్మెల్యేల ప్రశ్న అంటున్నారు కొందరు. మరోవైపు పార్టీ ఏదైనా కార్యక్రమానికి పిలుపునిస్తే… ఖర్చుల సంగతేంటని అడుగుతున్నారట జిల్లా అధ్యక్షులు. పార్టీ అధినాయకత్వం డబ్బులు పంపిస్తేనే ప్రోగ్రాం, లేకుంటే లేదని కరాఖండీగా చెప్పేస్తున్నట్టు తెలిసింది. హర్ ఘర్ తిరంగా కార్యక్రమానికి జండాలు పంపిస్తేనే చేస్తామని, మా జేబులు ఖాళీ చేసుకోలేమని చెప్పినట్టు ప్రచారం ఉంది. మొత్తంగా తెలంగాణ బీజేపీలో ఏదేదో జరిగిపోతోందని, ఇంతకు ముందు ఇలాంటి వాతావరణం లేదని వాపోతున్నారట పాత తరం నేతలు. పార్టీ పెద్దలు దీన్ని ఎలా సెట్ చేస్తారో చూడాలి మరి.