Off The Record: నిన్న మొన్నటిదాకా సింహపురి టీడీపీలో ఆయన చెప్పిందే వేదం. మంత్రుల్ని కూడా కాదని బదిలీలు, పోస్టింగ్స్ కోసం ఆయన దగ్గరికే పరుగులు పెట్టేవారట ప్రభుత్వ సిబ్బంది. కానీ… ఉన్నట్టుండి సీన్ మొత్తం మారిపోయింది. మౌన ముద్ర దాల్చారానేత. ఇంకా చెప్పాలంటే… అసలు నెల్లూరుకే ముఖం చాటేశారట. ఎవరా నేత? ఎందుకా మార్పు? ఆయన అనుచరులేమంటున్నారు?
నెల్లూరు జిల్లా అల్లూరు మండలం ఇసుకపల్లికి చెందిన బీదా రవిచంద్ర 1999 నుంచి టీడీపీలో యాక్టివ్‌గా ఉన్నారు. అప్పటి మంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డికి కుడి భుజంగా వ్యవహరించారాయన. తర్వాత ఆదాల టీడీపీని వీడినా… బీదా మాత్రం కొనసాగుతూ వచ్చారు. 2004 నుంచి 2014 వరకు పార్టీ అధికారంలో లేకపోయినా… పార్టీ జిల్లా అధ్యక్షుడి హోదాలో కార్యకలాపాలు నిర్వహించారు బీదా. ఇక 2014లో టిడిపి అధికారంలోకి రావడంతో ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం దక్కింది. నాడు జిల్లాలో మంత్రులుగా పొంగూరు నారాయణ… సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఉన్నా….. పాలనా వ్యవహారాలన్నీ రవిచంద్ర ఆధ్వర్యంలోనే జరిగేవి. అధికారుల బదిలీలు… అభివృద్ధి పనులు.. పార్టీ కార్యకలాపాల నిర్వహణను ఆయనకే అప్పగించేశారట నాటి మంత్రులు ఇద్దరూ. అప్పట్లో ఆయన సిఫారసు ఉంటే చాలు… ఆటోమేటిగ్గా పనులు జరుగుతాయన్న టాక్ ఉండేది. ఈక్రమంలో ఈసారి కూడా ఆయన కీలకంగా మారతారని ఊహించారట అంతా. పార్టీ అధికారంలోకి రాగానే… బదిలీల కోసం పోలీస్, రెవెన్యూతోపాటు వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగులు బీదా సిఫారసు లేఖల కోసం పోటీలు పడ్డారట. అందుకు తగ్గట్టుగానే ఆయన కూడా మొదట్లో స్పందించారన్నది పార్టీ వర్గాల మాట.
కానీ… క్రమంగా పరిస్థితి మారిపోయిందని అంటున్నారు.ఈసారి జిల్లా నుంచి మంత్రులుగా నారాయణతో పాటు ఆనం రామనారాయణరెడ్డికి ఛాన్స్ దక్కింది. అక్కడే పాత పరంపర దెబ్బ కొట్టిందని అంటున్నారు. రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు జిల్లా పర్యటన సందర్భంగా… మంత్రి ఆనం, రవిచంద్ర మధ్య వాగ్వివాదం జరిగింది. ఆత్మకూరు నియోజకవర్గానికి చెందిన టిడిపి నేత కన్నబాబుకు బీద రవిచంద్ర మద్దతు ఇవ్వడం ఆనంకు నచ్చలేదట. ఆ విషయమై ఇద్దరి మధ్య వాగ్వివాదం తీవ్రం కావడంతో మంత్రి నారాయణ జోక్యం చేసుకుని సర్ది చెప్పాల్సి వచ్చింది. ఈ విషయాన్ని అధిష్టానం దగ్గరే తేల్చుకుంటానని మంత్రి ఆనం అనడంతో… అక్కడ తనకే పరపతి ఉందని అన్నారు రవిచంద్ర. కొద్దిరోజులు తర్వాత జిల్లాలోని ఎమ్మెల్యేలు.. ఇతర ప్రజాప్రతినిధులు కలిసి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఒకరి నియోజకవర్గంలో మరొకరు జోక్యం చేసుకోకూడదని.. ఏదైనా జోక్యం చేసుకోవాల్సి వస్తే సంబంధిత ఎమ్మెల్యే అనుమతితోనే ముందుకు వెళ్లాలని తీర్మానించుకున్నారు. బీద రవిచంద్ర ఆధిపత్యానికి అడ్డుకట్ట వేసేందుకే ఈ ఏర్పాటని అప్పట్లో పార్టీ నేతలు మాట్లాడుకున్నారు.
ఆ ఎపిసోడ్ తర్వాత జిల్లా వ్యవహారాలకు రవిచంద్ర దూరంగా ఉంటున్నారు. తనకు సన్నిహితులైన మంత్రులు, కార్పొరేషన్ చైర్మన్లు.. ఇతర నేతలు జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు మాత్రం వారితో కలిసి తిరుగుతున్నారు. ఎక్కువ సమయం అమరావతికే కేటాయిస్తున్నారట ఆయన. ముఖ్యమంత్రి చంద్రబాబు…మంత్రి లోకేష్‌కు సన్నిహితుడుగా ఉన్న రవిచంద్రకు త్వరలోనే మంచి నామినేటెడ్ పదవి వస్తుందని, దానితోనే మా లీడర్ సత్తా చాటుతారని అంటున్నారు ఆయన సన్నిహితులు. వాళ్ళు అనుకున్నట్టుగానే బీదాకు ప్రోటోకాల్ పోస్ట్ వస్తే…. సింహపురి పొలిటికల్ సీన్ ఎలా మారుతుందో చూడాలంటున్నారు పరిశీలకులు.