పేరుకు రాష్ట్ర మంత్రి అయినా… ఆయన్ని ఆ జిల్లాలో పట్టించుకునే వాళ్ళే లేరా? ప్రత్యేకించి తాను ఇన్ఛార్జ్ మినిస్టర్‌గా ఉన్న జిల్లాలో సొంత పార్టీ ఎమ్మెల్యేలే… ఎవరయ్యా నువ్వు అన్నట్టుగా ఉంటున్నారా? ఎమ్మెల్యేల తీరుతో అమాత్యులవారి ఫ్రస్ట్రేషన్ పీక్స్ చేరుతోందా? ఛీ…… డ్యాష్‌లో జీవితం అనుకుంటున్న ఆ మంత్రి ఎవరు? ఎందుకంత దారుణంగా మారిపోయింది పరిస్థితి? చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డిపై ఉమ్మడి జిల్లాలో పలువురు ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉంటున్నారట. దాన్ని కూడా ఏ మాత్రం దాచుకోకుండా బయటపెట్టేస్తుండటం మంత్రికి మింగుడు పడటంలేదని అంటున్నారు. అలా ఎందుకయ్యా అంటే… రీజనైతే ఉందన్నది పరిశీలకుల మాట. ఉమ్మడి చిత్తూరు జిల్లా కోటాలో సీనియర్ నేతలు అమరనాథ్ రెడ్డి, నల్లారి కిషోర్ కూమార్ రెడ్డిల్లో కనీసం ఒక్కరికైనా మంత్రి పదవి గ్యారంటీ అని అప్పట్లో లెక్కలేసుకున్నారట. కానీ… అందుకు భిన్నంగా జిల్లా నుంచి అసలు ఎవరికీ కేబినెట్ బెర్త్ దక్కలేదు. అదే సమయంలో అన్నమయ్య జిల్లా రాయచోటి ఎమ్మెల్యేగా గెలిచిన రాంప్రసాద్ రెడ్డికి అనూహ్యంగా పదవి దక్కింది. జిల్లాలు వేరైనా, ఆయనతో పోలిక లేకున్నా… ఇక్కడి సీనియర్స్…. రాంప్రసాద్‌రెడ్డిని ఇన్ఛార్జ్ మంత్రిగా అంగీకరించలేకపోతున్నట్టు చెప్పుకుంటున్నారు. దాంతో వాళ్ళంతా నియోజవర్గానికే పరిమితం అవుతూ మిగిలిన కార్యక్రమాలకు టచ్‌మీ నాట్ అన్నట్టుగా ఉంటున్నారు. అదే సమయంలో రాంప్రసాద్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు కూడా గ్యాప్ రావడానికి మరో కారణం అంటున్నారు. జిల్లా ఇన్చార్జిగా నియమించి ఏడు నెలలు గడుస్తున్నప్పటికీ ఎమ్మెల్యేలందరితో కలిపి ఇంతవరకు ఒక్క సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయలేదు. పార్టీ సీనియర్ నేతలను కలుపు వెళ్ళడం లేదన్న అసంతృప్తి ఉంది. పేరుకు జిల్లా ఇన్ఛార్జ్ అయినా….పుంగనూరు మంత్రిగా వ్యవహరిస్తున్నారని, అక్కడికి లెక్కలేనన్ని సార్లు వెళ్ళిన మంత్రి కొన్ని నియోజకవర్గాల్లోకి ఇంతవరకు అడుగే పెట్టలేదని చెప్పుకుంటున్నారు. దీంతో మా ఊరికి మీ ఊరు ఎంత దూరమో… మీ ఊరికి మా ఊరు కూడా అంతే దూరమన్నట్టు జిల్లా నేతలు సైలెంట్‌గా ఉంటున్నారట. ఇన్నాళ్ళు అంతర్గతంగా ఉన్న విభేదాలు ఇప్పుడు రోడ్డున పడ్డాయని అంటున్నారు స్థానిక నేతలు, కార్యకర్తలు.
పుంగనూరు మండలం కృష్ణాపురంలో ఇటీవల టీడీపీ కార్యకర్త రామకృష్ణ హత్య జరిగింది. ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు వెళ్లి రామకృష్ణ కుటుంబాన్ని పరామర్శించాలని పార్టీ ఆదేశించింది. ఆ మేరకు మంత్రి వచ్చి కూర్చున్నా….. ఎమ్మెల్యేలు ఆయన్ని పట్టించుకోలేదట. చిత్తూరు, శ్రీకాళహస్తి, చంద్రగిరి, పూతలపట్టు ఎమ్మెల్యేలు గురజాల జగన్మోహన్, బొజ్జల సుధీర్‌రెడ్డి, పులివర్తి నాని, మురళీమోహన్తోపాటు పలమనేరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి అమరనాథ రెడ్డి… మంత్రితో కలిసి రామకృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సాయం చేశారు. ఆ కార్యక్రమం వరకు పైకి కలిసి ఉన్నట్టు కనిపించినా… మనసులు మాత్రం కలవలేదన్నది స్థానిక కేడర్‌లో వినిపిస్తున్న మాట. పరామర్శ తర్వాత జరిగిన ప్రెస్ మీట్ లో మంత్రి మాట్లాడారు. ఆ తర్వాత అమర్నాథరెడ్డిని మాట్లాడమని అడిగారు మిగతా ఎమ్మెల్యేలు. ఆయన ఆ పని చేయకపోగా…. అంతా మంత్రి మాట్లాడేశారు కదా…, ఇక నేనేంది మాట్లాడేది’ అంటూ అక్కడి నుంచి లేచి వెళ్లిపోయారు. ఆయన వెంటే మిగిలిన ఎమ్మెల్యేలు కూడా ఛలో అన్నారు. దాంతో ఈ వ్యవహారం జిల్లాలో చర్చనీయాంశం అయింది. ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదని, అస్సలు సహకరించడం లేదంటూ సన్నిహితుల దగ్గర వాపోతున్నారట మంత్రి. ఎమ్మెల్యేలు మాత్రం జిల్లాలో సీనియర్ నేత అిన అమర్నాథ్ రెడ్డి వెంట నడవడంలో తప్పు ఏముందని ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. కొందరైతే… మంత్రిగా ఆయన ఎవరికి ఎలాంటి సహాయం అందిస్తున్నారో అందరికీ తెలుసునంటూ బరస్ట్ అయిపోతున్నారట. అసలు ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదంటూ ఘాటుగా రియాక్ట్ అవుతున్న జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు సైతం ఉన్నారు. అసలాయన టీడీపీ వాళ్ళ గురించి పట్టించుకోకుండా… వైసీపీ నాయకులకు సాయం చేస్తున్నారంటూ.. ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు అధిష్టానానికి ఫిర్యాదు చేశారట. మంత్రి తీరు ఎమ్మెల్యేలకు ఏమాత్రం రుచించడం లేదని, ఆయన ఎలా ఉంటే మేం కూడా అలానే ఉంటామన్నది వాళ్ళ వైఖరిగా మాట్లాడుకుంటున్నారు. జిల్లా మొత్తాన్ని పట్టించుకునే మంత్రి లేక, అధికారులు విలువ ఇవ్వక అసలే మా పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటే… ఇప్పుడు వీళ్ళ గొడవలు పరిస్థితిని మరింత దిగజారుస్తున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారట ఉమ్మడి చిత్తూరు తమ్ముళ్ళు. సీఎం సొంత జిల్లాలో పార్టీ పరిస్థితిని ఎలా సెట్ చేస్తారో చూడాలి మరి.